రాఘవ లారెన్స్ పేరుతో మోసం
- IndiaGlitz, [Thursday,September 12 2019]
నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడైన రాఘవ లారెన్స్ సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు, చదువు చెప్పించడం ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవడం వంటి పనులను చేస్తుంటాడు లారెన్స్. అయితే ఇప్పుడు ఈయన నిర్వహిస్తున్న లారెన్స్ ట్రస్ట్ పేరును ఉపయోగించుకుని ఓ వ్యక్తి మోసం చేశాడు. వివరాల్లోకెళ్తే.. రామనాథపురం చిన్నకడైకి చెందిన అల్ అమీన్ భార్య పతూన్ నిషా తన కూతురు మెడికల్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తాను రాఘవ లారెన్స్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడినంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. లారెన్స్ ట్రస్ట్ ద్వారా ఉలూర్లోని మెడికల్ కాలేజ్‌లో సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. ప్రవీణ్ మాటలు నమ్మిన పతూర్ నిషా అతని బ్యాంక్ అకౌంట్‌కి 4.5 లక్షల రూపాయలను పంపింది.
తర్వాత హాస్ట్ ఫీజ్ అదీ ఇదీ అంటూ దాదాపు పతూర్ నిషా నుండి 18 లక్షల రూపాయలను ప్రవీణ్‌కుమార్ వసూలు చేశారు. ప్రవీణ్ మాత్రం మెడికల్ సీటు ఇప్పించలేదు. దీంతో రాఘవ లారెన్స్ ట్రస్ట్‌కు ఫోన్ చేసిన పతూర్ నిషాకు ప్రవీణ్ కుమార్ పేరుతో అక్కడెవరూ లేరనే విషయం తెలిసింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారాన్ని అందించిందిం. ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్‌కుమార్ కోసం గాలిస్తున్నారు.
రాఘవ లారెన్స్ ప్రస్తుతం బాలీవుడ్లో అక్షయ్‌కుమార్‌తో కాంచన రీమేక్ 'లక్ష్మీబాంబ్'ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మే 22న విడుదలకానుంది.