జగన్ సభలో ఏకైక ఎమ్మెల్యే.. ఆలోచనలో పడ్డ జనసేనాని!

  • IndiaGlitz, [Thursday,November 21 2019]

జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. అసెంబ్లీ వేదికగానే సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించడం.. ఆ తర్వాత ఆటోవాలాకు ఆపన్నహస్తాన్నిస్తూ రూ. 10వేల రూపాయిలు జగన్ కేటాయించినప్పుడు.. ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తూ మీడియా కంటపడ్డారు. ఇలా పలుమార్లు జగన్‌పై రాపాక ప్రశంసలు జల్లు కురిపిస్తూ ఆయన్ను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడారు. దీంతో కొంపదీసి ఉన్న ఒక్క.. ఏకైక ఎమ్మెల్యే కూడా జనసేనకు గుడ్ బై చెప్పేస్తారా.. ఏంటి..? ఇదే జరిగితే పరిస్థితేంటి..? అని అప్పట్లో జనసేన శ్రేణులు ఆలోచనలో పడ్డాయి. అంతేకాదు.. అధినేత పవన్ కల్యాణ్ కూడా అప్పట్లో క్లాస్ పీకినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇవన్నీ మరిచిపోవడానికో లేకుంటే.. ‘అబ్బే నేను పార్టీ మారట్లేదు’ అని నిరూపించుకోవడానికి కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇసుక కొరతపై చేపట్టిన ‘లాంగ్ మార్చ్’ వేదికగా ఒకప్పుడు జగన్‌ను ఏ రేంజ్‌లో అయితే ప్రశంసించారో.. అంతకు డబుల్‌గా రాపాక తిట్టి పోశారు. ఇక్కడితే జనసేన అధినేత, పార్టీ శ్రేణుల అనుమానాల్ని పటాపంచ్‌లయ్యాయి.

అందరి దృష్టి ఆయనపైనే!

ఈ ఘటనలన్నీ ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న పార్టీ శ్రేణులకు మరో ఊహించని సందర్భం చూడటంతో ఒకింత షాక్ తగిలినట్లైంది. గురువారం నాడు వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా.. ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అయితే ఈ సభలో జిల్లాకు చెందిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాడ వరప్రసాద్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. వాస్తవానికి ఏదైనా జిల్లాలో లేదా నియోజకవర్గంలో ప్రభుత్వం కార్యక్రమాలు పెడితే ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు.. ఏ పార్టీ అయినా హాజరవ్వడం అదొక ప్రొటోకాల్.. ఈ వ్యవహారం ఎప్పట్నుంచో నడుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని జనసేనలోని కొందరు లైట్ తీసుకుంటున్నా.. మరి కొందరు మాత్రం రాపాక సంగతేంటో తేల్చాలని లేకుంటే జనసేనకు డ్యామేజ్ జరుగుతుందని పవన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారట.

సీన్ మళ్లీ మొదటికొచ్చిందేం!

ఈ సడన్ సర్‌ఫ్రైజ్‌తో అసలేం జరుగుతోంది.. సీన్ మళ్లీ మొదటికొచ్చిందేంటి..? అని పవన్ సైతం ఒకింత ఆలోచనలో పడ్డారట. మరి తాజా వ్యవహారంతో ఆ ఏకైక ఎమ్మెల్యేను పవన్ ఏం చేస్తారో ఏంటో మరి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎన్నికల ఫలితాల అనంతరం.. తెలంగాణలోని హుజుర్‌నగర్ ఎన్నికల ఫలితాల అనంతరం త్వరలో ఏపీలో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయని.. ఆ నియోజకవర్గం రాజోలు అని వార్తలు వచ్చాయి. అంటే.. రాపాక రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అర్థం. మరి తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే జరిగేట్లుంది.. పరిస్థితి ఎలా ఉంటుందో..? పవన్ ఏ మేరకు ఒకానొక ఎమ్మెల్యేను ఎలా కాపాడుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.