AP Politics: పార్టీలు మారిన నేతలపై పోటాపోటీ ఫిర్యాదులు.. రసవత్తరంగా ఏపీ రాజకీయాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు రంజుగా మారుతోంది. ఎప్పుడూ ఏ పార్టీ నుంచి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఊహించడం కష్టమవుతోంది. మరో రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తాడోపేడో తేల్చుకునేందుకు కాళ్లు దువ్వుతున్నాయి. ఓవైపు వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని.. వైసీపీని గద్దె దించి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని టీడీపీ-జనసేన పంతం కట్టుకున్నాయి. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.
ఈ క్రమంలోనే పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలని పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ తరపున సైకిల్ గుర్తుపు గెలుపొంది వైపీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేయనుంది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వినతిపత్రం ఇవ్వనుంది. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి, వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్లపై చర్యలు తీసుకోవాలని కోరనుంది. తక్షణమే ఈ నలుగురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేయనుంది.
ఇదిలా ఉంటే ఇంతకుముందు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటు వేసిన నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవిలపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల వీరు టీడీపీలో చేరారు. మొత్తానికి ఎన్నికల వేళ ఇటు వైసీపీ, అటు టీడీపీ.. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పరస్పరం ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు కాక రేపుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout