'వాల్మీకి' పై సెన్సార్‌బోర్డుకి ఫిర్యాదు
- IndiaGlitz, [Monday,September 16 2019]
తమిళ చిత్రం 'జిగర్ తండా'ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తోన్న చిత్రం 'వాల్మీకి'. సెప్టెంబర్ 20న సినిమా విడుదలవుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై వరుణ్‌తేజ్, అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి ప్రధాన పాత్రధారులుగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో ఏమో కానీ.. సినిమాకు వద్దన్నా కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు అందింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ , బోయ సామాజిక నేతలు కలిసి సెన్సార్ సభ్యులను కలిశారు. గ్యాంగ్‌స్టార్ సినిమాకు.. రామాయణాన్ని రచించిన బోయ వంశానికి చెందిన వాల్మీకి పేరుని ఎలా పెడతారు? టైటిల్‌ను మార్చుకోవాలని చిత్ర యూనిట్‌కు బోయ సామాజిక వర్గం సూచిస్తూ సెన్సార్ బోర్డు సభ్యులకు వినతిపత్రాన్ని అందించింది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సినిమా టైటిల్‌ను మార్చకపోతే బోయలంతా ఏకమవుతారని, వారు తన సాయం కోరడంతో వారికి సాయంగా వచ్చానని, చిత్రటైటిల్ను మార్చకపోతే తదుపరి పరిణామాలకు చిత్రయూనిటే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ముందు నిండా వివాదాలే..
వాల్మీకి సినిమా ప్రారంభం నుండి పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అనంతపురం ప్రాంతంలో షూటింగ్ చేస్తున్న సమయంలో బోయసామాజిక వర్గానికి చెందిన వారు షూటింగ్‌ను జరగనివ్వలేదు. అంతే కాకుండా పలు సందర్భాల్లో వారు సినిమా టైటిల్‌ను మార్చాలంటూ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సినిమా టైటిల్ హీరో పేరు కాదని.. చిత్ర యూనిట్ వివరించినా ఎవరూ వినలేదు. ఇటీవల సెంట్రల్ బ్రాడ్కాస్ట్ మినిష్టర్ దగ్గరకు కూడా కంప్లైంట్ వెళ్లింది. అలాగే ఇప్పుడు సెన్సార్‌బోర్డుకు ఫిర్యాదు వెళ్లింది. మరిప్పుడు చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..