నాగశ్రీను వివాదం: మోహన్‌బాబు, మంచు విష్ణులపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు మోహన్‌బాబు చిక్కుల్లో పడ్డారు. ఆయన తమ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలంటూ నాయి బ్రాహ్మణులు రోడ్డెక్కారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద నిరసనలు తెలిపింది నాయి బ్రాహ్మణ సంఘం. తమ వర్గానికి క్షమాపణలు చెప్పే వరకు ఎంత దూరమైనా వెళ్తామని.. మున్ముందు తమ నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులపై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. 11 ఏళ్లుగా పనిచేస్తున్న నాగశ్రీనును కులం పేరుతో దూషించారంటూ నాయీబ్రాహ్మణ సంఘం నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కులాన్ని కించపరిచినందుకు మోహన్ బాబు, విష్ణులపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్సీని కోరారు.
ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాగశ్రీను గత 11 ఏళ్లుగా మోహన్‌బాబు నివాసంలో నమ్మకంగా పనిచేస్తున్నాడని చెప్పాడు. అలాంటి వ్యక్తిని కులం పేరుతో దూషించడం దారుణమని .. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేందుకు రెండ్రోజుల సమయం ఇచ్చామని శ్రీనివాస్ చెప్పారు. వారు స్పందించకపోవడంతోనే హెచ్చార్సీని ఆశ్రయించామని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా సమాజంలో కుల దూషణ పోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగిందంటే.. మోహన్ బాబు, మంచు కుటుంబానికి మేకప్‌మెన్‌గా పని చేస్తున్న నాగ శ్రీను.. ఇటీవల ఆ కుటుంబంపై తీవ్ర తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. తనను కులంపేరుతో, తమ తల్లిని మోహన్ బాబు, మంచు విష్ణులు అసభ్యంగా దూషించారని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇటీవల మంచు విష్ణు కార్యాలయం నుంచి నాగశ్రీను రూ.5 లక్షల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపై అక్రమంగా కేసు బనాయించారని నాగశ్రీను ఆరోపిస్తున్నాడు. ఇదే సమయంలో మెగాబ్రదర్ నాగబాబు... నాగశ్రీను కుటుంబానికి ఆర్థికసాయం అందించడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout