ఎమ్మెల్సీ కవిత రెండు ఓట్లు వేశారంటూ ఈసీకి ఫిర్యాదు
- IndiaGlitz, [Wednesday,December 02 2020]
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా పొతంగల్లో తన ఓటును వదులుకోకుండానే జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆమెపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ పార్థసారధికి శోభన్ ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనను ఉల్లంఘించిన ఆమె ఎమ్మెల్సీ పదవిని తక్షణమే రద్దు చేయాలని కోరారు. కవిత పొతంగల్ పోలింగ్ బూత్ నుంచి శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారనేందుకు ఆధారాలను సైతం ఎస్ఈసీకి ఇందిరా శోభన్ సమర్పించారు. పొతంగల్ ఓటరు జాబితాలో తన ఓటును తొలగించుకోకుండానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడమేనని ఇందిర విమర్శించారు. దీనిపై టీఆర్ఎస్ వర్గాలు స్పందించాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్ గ్రామ పరిధిలో తనకు, తన భర్తకు ఉన్న ఓటు హక్కును ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి మార్చాలని ఎమ్మెల్సీ కవిత అక్కడి ఈఆర్వోకు దరఖాస్తు చేసుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలోనే నవంబరు 28న ఓటు బదిలీ ప్రక్రియ పూర్తయిందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బదిలీ ప్రక్రియ పూర్తైన కారణంగానే కవిత హైదరాబాద్లో ఓటు వేశారని పార్టీ నేతలు తెలిపారు. కాగా, తమకు ఖైరాతాబాద్ ఈఆర్వో నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పొతంగల్లో ఉన్న కవిత ఓటును ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించామని.. నేషనల్ సర్వీసు ఓటర్ల లిస్టులో వారం రోజుల తర్వాత తొలగిస్తారని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ వెల్లడించారు.