'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' మూవీపై ఫిర్యాదు.. బూతు సన్నివేశాల్లో అలా..
- IndiaGlitz, [Tuesday,August 03 2021]
ఇటీవల ఓటిటీలు, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఎక్కువైనప్పటి నుంచి బోల్డ్ కంటెంట్ చిత్రాలు కూడా ఎక్కువవుతున్నాయి. యువతని ఆకర్షించే విధంగా ఫిలిం మేకర్స్ అడల్ట్ రొమాన్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఆ కోవకు చెందిన చిత్రమే 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'.
హస్వంత్ వంగ, నమ్రత దారేకర్ జంటగా నటిస్తున్నారు. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాల కృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్టు 6న రిలీజ్ కు ఈ మూవీ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రిలీజైన ట్రైలర్ చిత్ర యూనిట్ ని చిక్కుల్లో పడేసింది.
ఈ చిత్రంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హిందువులు ఆరాధ్య దైవాలుగా కొలిచే శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీ వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచే విధంగా.. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఈ చిత్ర ట్రైలర్ లో సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.
విహెచ్‌పి రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతన శశిధర్, బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో రెండు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు. ట్రైలర్ లో శ్రీకృష్ణుడిని అవమానించేలా డైలాగులు ఉన్నాయని అన్నారు. అలాగే వెంకటేశ్వర స్వామిని కీర్తించే 'భజగోవిందం' కీర్తనని బెడ్ రూమ్ బూతు సన్నివేశాల్లో ఉపయోగించారని ఆరోపించారు.
చిత్ర దర్శక నిర్మాతలని అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని లేకుంటే సినిమా రిలీజ్ నే అడ్డుకుంటామని హెచ్చరించారు. విశ్వ హిందూ పరిషద్ నేతలు నేతలు పురుషోత్తమా చార్యులు, కల్వ బాలరాజ్, ఆకాశ్ వాగ్మే, మహేష్ మారుపాకుల, నాగేంద్ర, మందాటి భాను చందర్ కూడా వనస్థలిపురం సిఐ ని కలసి ఫిర్యాదు అందించారు.