గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం పోటీ పడుతున్న ఆశావహులు..
- IndiaGlitz, [Friday,November 13 2020]
తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. పదవీకాలం ముగిసిన కర్నె ప్రభాకర్ సైతం తనకు మరోసారి అవకాశం లభిస్తుందని ఎదురు చూస్తున్నారు. అయితే అసలు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మనసులో ఎవరున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గవర్నర్ కోటాలో మూడు ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీంతో ఈ మూడింటినీ సామాజిక వర్గాల వారిగా విభజించనున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఓసీకి, మరొకటి బీసీకి.. మూడోది ఎస్సీ లేదంటే ఎస్టీకి ఇవ్వాలని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే గవర్నర్ కోటా వరకూ మాత్రం రాజకీయ నేతలతో కాకుండా ఇతర రంగాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కవులు, కళాకారులకు అవకాశం దక్కనుందని టాక్ నడుస్తోంది.
పరిశీలనలో గోరేటి వెంకన్న పేరు..
ఈ క్రమంలోనే అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చేలా పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం పనిచేసిన కవి.. కళాకారుడిని ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జానపద కవి.. గాయకుడు గోరటి వెంకన్న పేరు చర్చలోకి వచ్చినట్లు సమాచారం. పాలమూరు జిల్లాకు చెందిన వెంకన్న తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్య పరిచారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా పార్టీలకు అతీతంగా కళామతల్లికి సేవలందిస్తున్నారు. దీంతో కేసీఆర్ దృష్టి గోరేటి వెంకన్నపై పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గవర్నర్ కోటా కసరత్తు దాదాపు ముగిసినట్టు తెలుస్తోంది. దీంతో ముగ్గురి పేర్లనూ ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం..
కాగా నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీకాలం ముగియడంతో పాటు నాయిని మృతితో ఆయా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కాగా.. కర్నె ప్రభాకర్‌ను మరోసారి రెన్యువల్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మిగిలిన రెండు స్థానాలకు పీవీ కూతురు వాణి, గోరేటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, బసవరాజు సారయ్య, జూపల్లి కృష్ణారావు, రావుల శ్రావణ్‌రెడ్డి, గుండు సుధారాణి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సమావేశానంతరం ఎమ్మెల్సీలను కేసీఆర్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఎమ్మెల్సీలను ప్రకటించి ప్రమాణ స్వీకారం పూర్తయ్యేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.