తెలంగాణలో రాజా సాబ్ కొడుకో.. నిజాం చెంచానో సీఎం కాడు: తరుణ్ ఛుగ్
- IndiaGlitz, [Saturday,December 19 2020]
తెలంగాణ రాష్ట్రానికి 2023లో సామాన్యుడే సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ ప్రకటించారు. శుక్రవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏ రాజా సాబ్ కుమారుడో... అల్లుడో, నిజాం చెంచానో సీఎం కాబోడని తరుణ్ ఛుగ్ తేల్చిచెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ట్రైలర్ మాత్రమే చూపించామని.. అసలు సినిమా ముందుందన్నారు. కాగా టీఆర్ఎస్‌తో ఫైట్ గురించి తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. అది డూప్ ఫైట్ కానే కాదని.. కుస్తీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇంకా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో తండ్రీకొడుకుల, కొన్ని రాష్ట్రాల్లో తల్లీబిడ్డల పాలన చూశానన్నారు. తెలంగాణలో మాత్రం హిందూ అవిభాజ్య కుటుంబ పాలన సాగుతోందన్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, ఆత్మబంధువుతో కూడిన కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోందని విమర్శించారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడంలో ఈ కుటుంబంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమితో కంగారుపడిన సీఎం కేసీఆర్.. వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారన్నారు.
నిజానికి టీఆర్‌ఎస్, మజ్లిస్ మధ్య డూప్ ఫైట్ నడుస్తోందని, అందుకే ఫలితాలు వెలువడినా మేయర్‌ను ఎన్నుకోకుండా కాలం వెళ్లదీస్తున్నారన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ శ్రేణులకు తరుణ్ ఛుగ్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌తో రాజీ ప్రసక్తేలేదన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గెలుపొందిన కార్పొరేటర్లు, పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమైన తరుణ్ ఛుగ్ వారిని అభినందించారు.