అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. రేపటి నుంచి సామాన్య భక్తులకు దర్శనం..

  • IndiaGlitz, [Monday,January 22 2024]

దేశం మొత్తం వేయి కళ్లతో ఎదురుచూసిన అపూర్వ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జైశ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్యలోని తన జన్మభూమిలో ఆ కోదండరాముడు కొలువుదీరారు. దీంతో రేపటి నుంచి సామాన్య భక్తులకు ఆ బాలరాముడి దివ్య దర్శనం లభించనుంది. గర్భగుడిలో 24 అడుగుల దూరం నుంచి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. రెండు స్లాట్లుగా దర్శన సమయాలను నిర్ణయించారు. ఉదయం 7గంటల నుంచి 11.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 7గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. ప్రతీరోజూ మూడు హారతులు ఇవ్వనున్నారు. ఉదయం 6.30 గంటలకు శృగార హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఇస్తారు.

అంతకుముందు ప్రధాని మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12.29నిమిషాల 8సెకన్ల నుంచి 84 సెకన్లపాటు క్రతువు రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు ఘనంగా ముగిసింది. ప్రధాని మోదీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్ అనందీబెన్ పాటిల్‌, ప్రధాన అర్చకుడు మాత్రమే రామాలయం గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు. అనంతరం బాలరాముడికి మోదీ తొలిపూజ చేసి.. సాష్టాంగ నమస్కారం చేశారు.

విగ్రహ ప్రతిష్ఠాన క్రతువు ప్రారంభమైన సమయం నుంచి హెలికాప్టర్ల ద్వారా అయోధ్య రామాలయంపై పూల వర్షం కురిపించారు. అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. ఆ రాముడి తొలి చిత్రాన్ని చూసి ప్రజలు భక్తిపారవశ్యంలో పరవశించిపోయారు. స్వర్ణాభరణాలతో చిరుదరహాసంతో ధగధగా మెరుస్తూ దర్శనమిచ్చారు. కుడిచేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లుతో అభయమిచ్చారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు సమయంలో దేశం మొత్తం రామనామ స్మరణతో మారుమోగిపోయింది.

మరోవైపు ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించేందుకు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. చంద్రబాబు, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అలియా భట్, రణబీర్ కపూర్, జాకీ ష్రాఫ్, కంగనా, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్, సైనా నెహ్వాల్, సీఎం యోగి, సచిన్ టెండూల్కర్, రాజ్ కుమార్ రావు వంటి ప్రముఖులు వచ్చారు. భారీగా ప్రముఖులు అయోధ్యకు చేరుకోవడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 13 వేల మంది భద్రతా బలగాలు అయోధ్య చుట్టూ పహారా కాస్తున్నాయి. యూపీ పోలీసులు, సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.

More News

అంగన్‌వాడీలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధం.. విధుల్లో చేరని వారిపై వేటు..

అంగన్‌వాడీలపై జగన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తక్షణమే తొలగించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చలో విజయవాడకు అంగన్‌వాడీలు

కోట్లాది మంది కల సాకారం.. గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడు..

యావత్ దేశం 500 సంవత్సరాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుతమైన క్షణం ఆవిష్కృతమైంది. తన జన్మభూమిలో జయజయ ధ్వానాల మధ్య రాములోరు కొలువుదీరారు.

అయోధ్య రాములోరి సేవలో సినీ ప్రముఖులు

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం సమీపించింది. మరికొద్ది సేపట్లో జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన జరగనుంది.

PM Modi: అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ట..

ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు కాసేపట్లో మోక్షం లభించనుంది. వేల మంది సమక్షంలో ప్రధాని మోదీ అయోధ్య బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేయనున్నారు.

దళితులపై మరోసారి వివక్ష.. అంబేద్కర్‌పై విషం వెళ్లగక్కిన పెత్తందార్లు..

దళితులు అంటే పెత్తందారులకు ఎంత చులకనో మరోసారి బహిర్గతమైంది. దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఆవిష్కరించారు.