పవన్..ఉలికిపాటెందుకు..? ఏం సాధించావ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇస్తానన్న ‘రిటర్న్ గిఫ్ట్’ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఇటీవల ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఏపీకి వచ్చి కేసీఆర్ పోటీ చేయాలి కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఎలా సపోర్ట్ చేస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వైసీపీపై పవన్ చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది. పవన్ వ్యాఖ్యలపై తాజాగా టాలీవుడ్ రచయిత చిన్నికృష్ణ మీడియా మీట్ నిర్వహించి ఆయన సినిమాలు మొదలుకుని రాజకీయ వ్యవహారంపై సంచలన కామెంట్స్ చేశారు.
రిటర్న్ గిఫ్ట్‌పై...
"కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే నువ్వెందుకు ఉలికి పడుతున్నావ్?. 70 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నో రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసుంటున్నారు. వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. అంతేకాదు ఇక్కడి సెటిలర్స్ అంతా పవన్, బాబులకు వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు గోదావరి సాక్షిగా అంత మంది చావుకు కారణమైతే నీకు కనిపించలేదా పవన్?. బోయపాటి శ్రీనివాస్ అనే దర్శకుడిని తీసుకు వచ్చి వేలాదిమంది మధ్య షూటింగ్ చేస్తూ ఆడపడుచుల ఉసురు తీసి ఇప్పుడు పసుపు కుంకుమ పంచుతున్నారన్నారు. విజయవాడలో కేవలం 62 పిల్లర్ల ఫ్లైఓవర్‌ను ఇంతవరకు పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనటం లేదేం?అసలు ఇంత జరుతున్నా పవన్ అప్పుడు ఎందుకు స్పందించలేదు..? అని పవన్‌పై చిన్నికృష్ణ ప్రశ్నల వర్షం కురిపించారు.
నువ్వేం సాధించావ్ పవన్..?
" సినీ రంగంలో అసలు నువ్వు ఎన్ని విజయాలు సాధించావ్ చెప్పు?. అజ్ఞాతవాసి.. ఓ విదేశి కథను కాఫీ కొట్టి తెరకెక్కించిన సినిమా కాదా...? దొంగతనం చేసిన కథతో సినిమా తెరకెక్కించి ఆ విషయంలో టీ- సీరిస్‌కు పెనాల్టీ కట్టిన విషయం నిజం కాదా?. రాజకీయం అంటే త్రివిక్రమ్ రాసిచ్చిన డైలాగులు చెప్పటం కాదు పవన్.." అంటూ మీడియా ముఖంగా పవన్‌పై చిన్నికృష్ణ చురకలంటించారు.
మే 23న మీ గుండెలు బద్ధలైపోతాయ్!
"వైఎస్ జగన్ సొంతగా పార్టీ పెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతున్నారు. అంతలా ఆయన కష్టపడుతుంటే విమర్శిస్తారా..? ఆయన తండ్రిని చంపారు.. బాబాయిని చంపి ఆ నింద వేస్తున్నారు. ఆయన్ని చంపే కుట్రలు చేస్తున్నారు. ఇదేనా రాజకీయం..? రాజకీయం అంటే ఏంటో సీనియర్ల దగ్గరికి వెళ్లి నేర్చుకో. మే 23న రాబోయే రిజల్ట్ చూస్తే మీ గుండెలు బద్ధలైపోతాయి. ప్రజలు జగన్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు" అని చిన్నికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా మెగా ఫ్యామిలీకి ఎన్నో సూపర్ హిట్ కథలు అందించిన ఈయన ఇలా మాట్లాడగటం గమనార్హం.
కాగా.. తనపై విమర్శలు గుప్పించే వారిపై తీవ్ర స్థాయిలో యూ ట్యూబ్ వేదికగా రియాక్ట్ అయ్యే నాగబాబు.. ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్ కల్యాణ్ ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. చిన్నికృష్ణ వ్యాఖ్యలపై మెగాభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం రచయిత వ్యాఖ్యలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout