Comedian Sudhakar : ఆ వార్తలు నమ్మొద్దు.. నేను క్షేమంగా వున్నా : కమెడియన్ సుధాకర్
- IndiaGlitz, [Thursday,May 25 2023]
సోషల్ మీడియా రాకతో ప్రతి వార్తా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇదే సమయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేని పరిస్ధితి. ఎవరైనా సెలబ్రెటీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో జాయిన్ అయితే చాలు వారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఫలానా ప్రముఖులు తామే బతికే వున్నామని .. తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కోటా మరణించారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్త క్షణాల్లో వైరల్ అయ్యింది.
శరత్ బాబును ముందే చంపేశారు :
అసలే కే. విశ్వనాథ్, జమున, తారకరత్నల మరణాలతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన చిత్ర పరిశ్రమ ఈ వార్తతో ఉలిక్కిపడింది. దీంతో కోటానే స్వయంగా వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. డబ్బు కోసం ఇలాంటి పనులు చేయొద్దని కోటా విజ్ఞప్తి చేశారు. ఇక ఇటీవల మరణించిన సీనియర్ నటుడు శరత్ బాబు విషయంలోనూ ఇలాగే జరిగింది. ఐసీయూ నుంచి మరో వార్డ్‌కు ఆయనను తరలిస్తుండగా.. శరత్ బాబు మరణించారంటూ కథనాలు వచ్చాయి. పలువురు సెలబ్రెటీలు ఆయన మరణించినట్లుగా ట్వీట్స్ చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో శరత్ బాబు సోదరి క్లారిటీ ఇచ్చారు.
తాను బాగానే వున్నానంటూ సుధాకర్ క్లారిటీ :
తాజాగా అలనాటి మేటి హాస్యనటుడు సుధాకర్ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సుధాకర్ స్వయంగా వీడియో విడుదల చేశారు. కొన్నిరోజులుగా తనపై, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు, ఇలాంటి సమాచారాన్ని నమ్మొద్దని సుధాకర్ కోరారు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సుధాకర్ క్షేమంగా వుండటంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
సినిమాలకు దూరంగా సుధాకర్ :
కాగా.. తొలుత హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధాకర్.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించారు. కామెడీలో డిఫరెంట్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో కడుపుబ్బా నవ్వించారు. వయోభారం, ఇతరత్రా కారణాలతోనే సుధాకర్ సినిమాలకు దూరంగా ఇంట్లోనే వుంటున్నారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారని, ఐసీయూలో చావు బతుకుల మధ్య వున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన స్వయంగా స్పందించారు.