ఇకపై సినిమాలు చేయను.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం, ట్వీట్ వైరల్
- IndiaGlitz, [Saturday,February 05 2022]
తెలుగులో నటుడిగా, కమెడియన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. షార్ట్ ఫిలింస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయనకు అర్జున్ రెడ్డి తర్వాత దశ తిరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో వరుస ప్రాజెక్ట్‌ల్లో అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్నారు. ‘భరత్ అనే నేను’, ‘చిలాసౌ’, ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘జాతిరత్నాలు’, ‘నెట్’, ‘స్కైలాబ్’ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌లోనూ రాహుల్.. ఓ కీలక పాత్ర సొంతం చేసుకున్నారంటే ఆయన క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. గతేడాది జాతిరత్నాలు సూపర్‌హిట్ కావడంలో రాహుల్ పాత్ర ఎంతో వుంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టితో సమానంగా నవ్వించాడు. ‘‘ నా వల్లే ప్రాబ్లం అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ ’’ ఆయన చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు రాహుల్. తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులకు పంచుకుంటూ వుంటారు. తాజాగా శనివారం రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ సినీజనాలను, అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. ఇకపై తాను సినిమాలు చేయడం లేదంటూ ఆయన అనౌన్స్ చేశారు. 2022లో ఇదే నా చివరిది.. ఇకపై నేను సినిమాలు చేయను’’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. రాహుల్ ట్వీట్‌పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రాంక్ చేస్తున్నావా ? లేదా ఏదైనా ప్రమోషన్ కోసమా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
2022 is my last.
— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022
I will not do films anymore.
Not that I care, nor should anybody care