ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి ఇక లేరు..
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.
జయప్రకాష్‌రెడ్డి.. కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని సిరివెళ్ల గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో 1946 మే 8న జన్మించారు. ఆయన తండ్రికి నాటకాలపై ఆసక్తి ఉంటడంతో తండ్రీకొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ జయప్రకాష్‌రెడ్డి ముందుండే వారు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. అయినప్పటికీ నటనపై మక్కువతో నాటక ప్రదర్శనలు మాత్రం ఇస్తుండే వారు. అలా ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావు చూశారు.
జయప్రకాష్‌రెడ్డి నటనకు ముగ్ధుడైన దాసరి.. నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అలా జయప్రకాష్‌రెడ్డి 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. 1997లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం ప్రతినాయకునిగా మంచి పేరును తీసుకురావడమే కాకుండా ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు వంటి చిత్రాలతో జయప్రకాష్‌రెడ్డి మరింత ఫేమస్ అయ్యారు. జయప్రకాష్ రెడ్డి చివరి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments