వైసీపీలో చేరిన ఆలీ.. నో టికెట్.. ప్రచారానికే పరిమితం
- IndiaGlitz, [Monday,March 11 2019]
టాలీవుడ్ సినీ నటుడు అలీ ఎట్టకేలకూ తిరిగి తిరిగి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా.. ఇది అటు జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకింత షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరితో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన అలీ.. టీడీపీలో చేరిక దాదాపు ఖరారైందని అందరూ భావించారు.. అభ్యర్థుల జాబితాలో అలీ పేరు కచ్చితంగా ఉంటుందని అనుకున్నారు. అయితే అందరికీ షాకిచ్చి ఒక్కసారిగా లోటస్‌పాండ్‌లో ఆయన ప్రత్యక్షమయ్యారు. అలీని వైసీపీలో చేరికకు సీనియర్ నటుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీ, నటుడు, వైసీపీ నేత కృష్ణుడు కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. వైసీపీ కండువా కప్పుకున్న అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఆహ్వానం మేరకే...
జగన్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా నమ్ముతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో తాను ఆయన్ని గతంలో కలిసి మాట్లాడినప్పుడు... పార్టీలోకి ఆహ్వానించారు. కానీ తానే కొంత సమయం కావాలని కోరినట్లు తెలిపారు. ఫస్ట్ టైమ్ 1999లో ఓ పార్టీ(టీడపీ) కండువా కప్పుకున్నానని.. మళ్లీ 2019 వైసీపీ కండువా కప్పుకున్నానని అలీ తెలిపారు. కచ్చితంగా మంచి మెజారిటీతో జగన్‌ని సీఎం చేయడమే తన ధ్యేయమని అలీ చెప్పుకొచ్చారు.
టికెట్ ఇస్తే కచ్చితంగా పోటీ..
పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ చాలా మందికి హామీ ఇచ్చిన కారణంగా తనకు టికెట్ దక్కే అవకాశం లేదని.. అందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం పార్టీ తరఫున ప్రచారం మాత్రమే చేస్తానన్నారు. ఒకవేళ జగన్ తనకు రాజమండ్రి కానీ విజయవాడ టికెట్ ఇస్తే.. ఏ మాత్రం ఆలోచించకుండా పోటీ చేస్తానని అలీ తన మనసులోని మాట బయటపెట్టారు. ఈ సందర్భంగా ఇంతక మునుపు చంద్రబాబు, పవన్‌ను ఎందుకు కలిశాననే విషయంపై కూడా అలీ క్లారిటీ ఇచ్చారు. పవన్, చంద్రబాబును ఇద్దర్నీ కలిసి హ్యాపీ న్యూయర్ చెప్పానని అంతకు మించి ఏమీ లేదన్నారు.
జనసేనలో ఎందుకు చేరలేదు..!?
జనసేనలో ఎందుకు చేరలేదనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. స్నేహం వేరు.. రాజకీయం వేరు అని అన్నారు. పవన్ కల్యాణ్ నా స్నేహితుడు. స్నేహానికి రాజకీయాలకు సంబంధం లేదు. జగన్ కావాలి.. జగన్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కావున తాను వైఎస్సార్‌సీపీలోకి రావడం జరిగింది. నాకు అన్ని పార్టీలు, అందరూ తెలిసినవారే. కానీ జగన్ రావాలి, జగన్ కావాలి అని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. మనం కూడా అందుకు చేయూతనివ్వాలి అని వైసీపీలో చేరాను అని నటుడు అలీ మీడియాకు వివరించారు.