వైఎస్ జగన్‌కు ఝలక్.. బీజేపీలోకి ‘అలీ’!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కమెడియన్ అలీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్ ఇవ్వబోతున్నారా..? ఎవరూ ఊహించని రీతిలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో పాటు కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడంతో అలీ మనసు నొచ్చుకుందా..? అందుకే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవే అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ అలీ ఢిల్లీ వెళ్లడం వెనుక అసలు కారణాలేంటి..? నిజంగానే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా..? అనే విషయం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఢిల్లీ పర్యటన వెనుక..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే అలీకి ఎంత భక్తో.. ఎంత అభిమానమో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. పవన్ ప్రతి సినిమాలో దాదాపు అలీ కమెడియన్ నటించేవాడు. అలా పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీతో కూడా ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలుండేవి. అయితే పవన్.. జనసేన స్థాపించిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేనాని సమక్షంలో అలీ పార్టీలో చేరతారని భావించినప్పటికీ.. కొన్ని రోజులు జనసేన.. మరికొన్ని టీడీపీ.. ఇంకొన్ని రోజులు వైసీపీ అధినేతల చుట్టూ తిరిగి తిరిగి చివరికీ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లలో ఏదో ఒకటి దక్కుతుందని భావించినప్పటికీ ఆశలు అడియాసలయ్యాయ్. అంతేకాదు.. కనీసం నామినెటెడ్ పదవి అయినా వస్తుందనుకుంటే అది కూడా రాకపోవడంతో అలీ మనస్థాపానికి గురయ్యాడట. దీంతో చేసేదేమీ లేక పార్టీ మారాలని భావించిన ఆయన.. బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని ఫిక్స్ అయ్యారని టాక్ నడుస్తోంది.
పవన్‌కు దగ్గరవుతున్న అలీ!
అందుకే ఇటీవల ఆయన ఢిల్లీకెళ్లి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేఖర్తో భేటీ అయ్యారని సమాచారం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో కాకుండా నేరుగా ఢిల్లీ పెద్దలను కలవాలని అలీల భావించారట. మరోవైపు బీజేపీ-జనసేన ఒక్కటవ్వడంతో.. పవన్‌కు అలీ దగ్గరవుతున్నారని ఇరువురి అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే.. ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయం నిజమైతే వైసీపీకి.. జగన్‌కు ఝలక్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీలో ఇంత హంగామా జరిగినప్పటికీ అలీ మాత్రం అబ్బే తాను సినిమా షూటింగ్ స్థలాలకై అనుమతి కోసం వెళ్లానని చెప్పుకుంటున్నారు. ఇందులో ఏది నిజమో..? ఏది అబద్ధమో అలీకే ఎరుక.!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments