Chiru-Venkaiah Naidu: 'పద్మవిభూషణుల' కలయిక.. ఒకరిపై ఒకరు ప్రశంసలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రజలకు గర్వకారణమైన ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట కలిశారు. ఒకే రాష్ట్రానికి చెందిన తెలుగు తేజాలకు ఒకేరోజు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించండం చాలా అరుదు. అందులోనూ వారిద్దరు స్నేహితులు కావడం మరో విశేషం. వారే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'పద్మవిభూషణ్' అవార్డులు దక్కించుకున్న ఈ ఇద్దరు కలుసుకుని ఒకరికొకరు అభినందనలు తెలియజేసున్నారు. హైదరాబాద్‌లోని వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనను అభినందించారు. అనంతరం వెంకయ్య కూడా చిరును శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని, గడిపిన క్షణాలను గర్తుచేసుకున్నారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ 'జైఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి ఉద్యమనేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు’ అని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తాను సినిమాలలోకి వచ్చానని, ఆయన రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారు. అలాగే తామిద్దరం పార్లమెంట్‌లో కొలిగ్స్‌గా ఉన్నామని, అప్పుడు అనేక విషయాలు ఆయనను అడిగి తెలుసుకొనేవాడిని అని చెప్పారు.
"వెంకయ్యనాయుడు గారు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి అని ఆయనను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అలాంటి వెంకయ్య గారితో పాటుగా తనకు కూడా పద్మవిభూషణ్ రావటంతో తన ఆనందం రెట్టింపు అయింది. ఇద్దరు తెలుగువాళ్లం, స్నేహితులం. ఒకేసారి ఒకే అవార్డు రావటం థ్రిల్లింగ్ అనిపించింది. మేమిద్దరం కలుసుకొని జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం" అని తెలిపారు.
వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 'తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రెండు కళ్లు అయితే, చిరంజీవి మూడో కన్ను' అని కొనియాడారు. 'ఈ అవార్డు రావటానికి చిరంజీవికి అన్ని అర్హతలు ఉన్నాయి. కష్టపడి ఒకో అడుగు వేసుకుంటూ, ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగారు. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంది. మెగాస్టార్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది" అని ప్రశంసించారు.
అనంతరం ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "సంతోషకరమైన క్షణాలను వెంకయ్యనాయుడి గారితో పంచుకున్నాను. ప్రతిష్టాత్మకమైన గౌరవం అందుకున్నందుకు తోటి గ్రహీతలుగా ఒకరినొకరు అభినందించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది" అని ట్వీట్ చేశారు. దీంతో ఇద్దరు దిగ్గజాలు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పెద్ద ఎత్తున ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తు్న్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments