తమిళ హీరో జయం రవి హీరోగా నటించిన చిత్రం కోమాలి. ప్రదీప్ రంగనాథన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్‌ను మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్‌ను చూస్తే 16 ఏళ్ల తర్వాత కోమా నుండి బయటపడ్డ యువకుడు.. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే పాయింట్ మీద రూపొందిన కోమాలి చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పించిందనేది తెలుసుకోవాలంటే ముందు సినిమా కథంటో చూద్దాం...
కథ:
1990లో రవి(జయం రవి).. పదవ తరగతి విద్యార్థి. తన క్లాస్ మేట్‌తో క్రష్‌లో ఉంటాడు. ఓ ప్రమాదంలో రవి కోమాలోకి వెళ్లిపోతాడు. దాదాపు పదహారేళ్ల తర్వాత నిద్ర లేస్తాడు. అప్పటికే అతని చుట్టూ ఉన్న ప్రపంచం చాలా మారిపోతుంది. తన ఆలోచనలు పదహరేళ్ల వయసుకే ఆగిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో రవికి అతని స్నేహితుడు..చెల్లెల భర్త(యోగిబాబు) అండగా నిలబడతాడు. సాంకేతికంగా మనిషి ఎదిగే క్రమంలో ఏం కోల్పోయాడనే విషయాన్ని రవి గ్రహిస్తాడు. అదే సమయంలో ఓ లోకల్ రాజకీయ నాయకుడు(కె.ఎస్.రవికుమార్)తో రవికి చిన్న సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యేంటి? ఆ సమస్య నుండి రవి ఎలా బయటపడ్డాడు? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
సమీక్ష:
ఇందులో ముందుగా నటీనటుల విషయానికి వస్తే.. హీరో జయం రవి సినిమానంతటినీ తానే అయ్యి ముందుకు నడిపించాడు. సినిమా రెండు పార్టులుగా ఉంటుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఓ పార్ట్ కథ నడిస్తే.. 2016 బ్యాక్‌డ్రాప్‌లో మరో కథ రన్ అవుతుంది. జయం రవి రెండు పార్టుల్లో నటించడానికి లుక్ పరంగా చాలా వేరియేషన్స్ చూపించాడు. ముఖ్యంగా 1990 బ్యాక్‌డ్రాప్ కోసం బరువు తగ్గి ఇంటర్మీడియట్ కుర్రాడిలా కనడపడటం.. జయం రవి కమిట్‌మెంట్‌కు ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే 2016లో జరిగే కథలోనూ ఎప్పటిలాగానే కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్, సంయుక్తా హెగ్డే వారి వారి పాత్రలకు తగ్గట్టు న్యాయం చేశారు. విలన్‌గా చేసిన కె.ఎస్.రవికుమార్ బాగా చేశాడు. అలాగే యోగిబాబు పాత్ర కామెడీ పరంగా ఓకే. మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక దర్శకుడు ప్రదీప్ రంగనాథన్.. కోమాలోకి వెళ్లిన వ్యక్తి పదహారేళ్ల తర్వాత నిద్ర లేస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌ను తీసుకుని దానికి తగ్గ కామెడీని యాడ్ సినిమాను తెరకెక్కించాడు. విలనిజాన్ని కూడా చాలా సింపుల్‌గా.. చక్కగా చూపించారు. అయితే కథలోని లాజిక్ వెతికితే ఆ లోపం మనకు కనిపిస్తుంది. ఇక ఎటో స్టార్ట్ అయిన కథ.. ఎటో వెళుతున్నట్లు అనిపిస్తుంది. హిప్ హాప్ తమిళ సంగీతం బావుంది. రిచర్డ్ కెమెరా పనితం ఆకట్టుకుంటుంది. మొత్తానికి సినిమాను లాజిక్స్ వెతక్కుండా చూడాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు.
చివరగా.. ఓసారి చూసే టైంపాస్ మూవీ కోమాలి
Comments