Colour Photo Review
కమెడియెన్స్ హీరోలుగా పరిచయం కావడం తెలుగు ఇండస్ట్రీకి కొత్తేం కాదు. ఆ కోవలో లేటెస్ట్‌గా ‘కలర్‌ఫొటో’అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. తొలి సినిమాకే హీరో అంటే అలా ఉండాలి.. ఇలా ఉండాలనేం కాకుండా నార్మల్ కాలేజ్ స్టూడెంట్‌లా లవ్‌స్టోరితో మెప్పించే ప్రయత్నం చేశాడు. పడిపడిలేచెమనసు, మజిలీ సినిమాల్లో హీరో స్నేహితుడిగా కనిపించిన సుహాస్ మరి హీరోగా ఎలా మెప్పించాడు? అనే విషయం తెలియాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
1997.. మచిలీపట్నంలో కథ మొదలవుతుంది. అప్పుడప్పుడే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పెరుగుతున్న సందర్భం. పాలు అమ్ముకుని బతికే కుటుంబానికి చెందిన జయకృష్ణ(సుహాస్) ఇంజనీరింగ్‌లో జాయిన్ అవుతాడు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనేది తన లక్ష్యం. అయితే తను నల్లగా ఉంటాడు. సీనియర్స్ అందరూ దాంతో జయకృష్ణను ఆటపట్టిస్తుంటారు. ఓ సందర్భంలో దీప్తివర్మ(చాందిని చౌదరి)ని ప్రేమలో పడతాడు. ఆమె కూడా జయకృష్ణను ప్రేమిస్తుంది. అయితే దివ్య అన్నయ్య ఇన్‌స్పెక్టర్ రామరాజు(సునీల్)కి వీరి ప్రేమ నచ్చదు. అందుకు కారణం జయకృష్ణ నల్లగా ఉండటమే. ఇద్దరినీ విడదీయడానికి రామరాజు చాలా ప్రయత్నాలు చేస్తాడు. అసలు జయకృష్ణ ఏం చేస్తాడు? ప్రేమికులు విడిపోయారా? కలుసుకున్నారా? చివరి వీరి ప్రేమకథలో ఎలాంటి మలుపు తీసుకుంది? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
ముందుగా సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడాలంటే దర్శకుడు సందీప్ రాజ్ గురించి చెప్పుకోవాలి. సాధారణంగా మనం పేపర్లలో ప్రేమికులు ఆత్మహత్య ప్రయత్నం అనే పాయింట్‌ను తీసుకుని దానికి మచిలీపట్నం..1997లో బ్యాక్‌డ్రాప్ తీసుకుని ప్రేమకథను రాసుకున్నాడు. సాధారణంగా ప్రేమకు కులమతాలు, డబ్బు ..ఇలా విషయాలు అడ్డుపడుతుంటాయి. కానీ ఈ విషయంలో బాడీ షేమింగ్ (శారీరక వర్ణం.. అంటే తెల్లగా ఉండేవాడు, నల్లగా ఉండేవాడిని అవమానించడం, తక్కువగా చూడటం)అడ్డుపడితే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద సినిమాను సందీప్ రాజ్ తెరకెక్కించాడు. హీరో నల్లగా ఉంటాడనే విషయాన్ని ఎష్టాబ్లిష్ చేస్తూ సినిమా అంతా ఉంటుంది. కానీ... సినిమా స్లోగా ఉండటం, సాగదీతగా అనిపిస్తుంది. సినిమాలో లవ్ పాయింట్ మెయిన్.. దాని చుట్టూ సినిమాను రన్ చేయాలనుకున్న దర్శకుడు కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లడానికి ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం కాలేజీ గొడవలనే చూపించే ప్రయత్నం. ఇక క్లైమాక్స్‌లో ఎమోషన్ మరీ ఎక్కువగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య లవ్‌ట్రాక్ స్టార్ట్ కావడానికి చూపించిన కారణం బలమైనదిగా అనిపించలేదు. కామెడీ పార్ట్ పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించదు. వెంకట్ శాఖమూరి సినిమాటోగ్రఫీ, కాలభైరవ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. నటీనటుల విషయానికి వస్తే సినిమాలో నాలుగైదు ప్రధాన పాత్రలతోనే రన్ అవుతుంది. అందులో సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవాహర్ష.. అందరూ వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో కాబట్టి సినిమాను తీరిక ఉన్నప్పుడంతా చూసుకుంటాను అనుకుంటే .. ఓసారి చూడొచ్చంతే.
బోటమ్ లైన్: కలర్‌ఫొటో.. రంగు వెలిసింది
Read 'Colour Photo' Review in English
- Read in English