68th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘‘కలర్ ఫోటో’’... బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘థమన్’

2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. అయితే ఈసారి బెస్ట్ క్రిటిక్ అవార్డ్ ఎవరికీ లేదని కేంద్రం తెలిపింది. ఫిల్మ్ మేకర్ విపుల్ షా నేతృత్వంలోని 10 మంది సభ్యుల జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది. 30 భాషలకు చెందిన సినిమాలు 50 కేటగిరీలలో 300 ఫీచర్ ఫిల్మ్‌లు, 150 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లు అవార్డుల కోసం పోటీపడ్డాయి.

ఇందులో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ నిలిచింది. సందీప్ రాజ్ దర్శకత్వంలో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించారు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘తరగతి గదిలోనా’ పాట యువతను ఉర్రూతలూగించింది. ఇక జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ నిలిచారు. అల వైకుంఠపురం చిత్రానికి గాను ఈయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించారు.

అటు నాట్యం సినిమాకు గాను రెండు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి పనిచేసిన టీవీ రాంబాబుకు బెస్ట్ మేకప్ మెన్‌గా, సంథ్యా రాజుకు బెస్ట్ కొరియోగ్రఫర్‌గా అవార్డులు దక్కాయి.