ఏపీలో కొత్త జిల్లాలు.. ఇకపై రాయలసీమకూ సముద్రతీరం, ఎలాగంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన కొనసాగించాలని సీఎం జగన్ పట్టుదలగా వున్నారు. అయితే జిల్లాల విభజన, వాటి పేర్లకు సంబంధించి అప్పుడే అభ్యంతరాలు మొదలయ్యాయి. అలాగే కొత్త జిల్లాల కారణంగా కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సముద్ర తీరం కోస్తా జిల్లాలకు మాత్రమే వుండేది.. అయితే జిల్లాల పునర్విభజన కారణంగా రాయలసీమకూ తీర ప్రాంతం వచ్చింది. అదెలాగంటే..

కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలను ఇప్పటి వరకు రాయలసీమగా పరిగణిస్తున్నారు. 26 జిల్లాల పునర్విభజనతో కోస్తా జిల్లాల సంఖ్య 12 కానుంది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పడే శ్రీబాలాజీ జిల్లాతో కలపడంతో రాయలసీమకు తీరప్రాంతం వచ్చినట్లయింది. అలాగే రాయలసీమలో జిల్లాల సంఖ్య నాలుగు నుంచి ఎనిమిదికి పెరిగింది. ఇప్పటికే వున్న కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలకు తోడుగా కొత్తగా నంద్యాల, శ్రీసత్యసాయి, శ్రీబాలాజీ, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటవుతున్నాయి.

అంతేకాదు ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏజెన్సీ జిల్లాలంటూ ఏంలేవు. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కొంత భాగాన్ని ఏజెన్సీ ప్రాంతాలుగానే పిలిచేవారు. జిల్లాల విభజన కారణంగా ఇప్పుడు పాడేరు, పార్వతీపురం కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి.

మరోవైపు ప్రస్తుత కడప జిల్లా పరిధిలో ఉన్న రాయచోటిని అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా చేయడంపై రాజంపేటవాసులు భగ్గుమంటున్నారు. దీనిలో భాగంగా గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజంపేట వైసీపీ మున్సిపల్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 3వేల మంది విద్యార్థులు నిరసన నిర్వహించారు. ‘జిల్లా కేంద్రంగా రాయచోటి వద్దు.. రాజంపేట ముద్దు’ అంటూ ర్యాలీ చేపట్టారు.