తెలుగు సినిమా మారుతుంది. కొత్త కథలు వస్తున్నాయి. కాన్సెప్ట్ బావుంటే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తను చూసిన సన్నివేశాలను ఆధారంగా చేసుకుని ఓ కథను రాసుకున్నాడు. తను ఉన్న గ్రామంలో అందరికీ ట్రయినింగ్ ఇచ్చి సినిమా చేశాడు. తను ఉన్న ఊరి పేరునే టైటిల్‌గా పెట్టాడు. ఏదో షార్ట్ ఫిలిం చేసి నిర్మాతలు ఒప్పించి సినిమా చేసిన దర్శకుడు వెంకటేష్ మహా ఇంతకు కేరాఫ్ కంచరపాలెం ద్వారా ఏం చెప్పాలనుకన్నాడో తెలియాలంటే కథేంటో చూద్దాం...
కథ:
కథ కంచరపాలెం అనే ఊరిలోనే ఓపెన్ అవుతుంది. రాజు(సుబ్బారావు) అక్కడ గవర్నమెంట్ ఆఫీస్‌లో అటెండర్‌గా పనిచేస్తుంటాడు. తనకు దేవుడంటే నమ్మకం ఉండదు. కానీ తన పక్కనున్న మనుషులను నమ్ముతుంటాడు. 49 ఏళ్ల వయసు అవుతున్నా కూడా..పెళ్లి కాకపోవడంతో అందరూ అతన్ని ఎగతాళి చేస్తుంటారు. రాజు పనిచేసే ఆఫీస్‌కు హెడ్ ఆఫీసర్‌గా రాధ వస్తుంది. భర్త చనిపోయి.. 20 ఏళ్ల కూతురున్న రాధ .. రాజుని ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. రాజు కూడా ఆమె ప్రేమను అంగీకరించినా.. వాళ్ల ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారోనని భయం ఉంటుంది. ఇంతకు వారిద్దరూ ఒక్కటయ్యారా?
కంచరపాలెంలో రౌడీ, వ్యాయామశాల ఓనర్ అయిన అమ్మోరు దగ్గరుండే జోసెఫ్(కార్తీక్ రత్నం) అనాథ. అమ్మోరు చెప్పిన వ్యక్తులను జోసెఫ్ కొడుతుంటాడు. ఓరోజు భార్గవి(ప్రణీత పట్నాయక్)తో మొదలైన గొడవ.. ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీస్తుంది. వేర్వేరు మతస్థులైన వీరి ప్రేమ గెలిచిందా?
వైన్ షాప్‌లో పనిచేసే గడ్డం(మోహన్ భగత్).. తన కొట్టు దగ్గర మందు కొనడానికి వచ్చే సలీమా(ప్రవీణ పరుచూరి)ని ప్రేమిస్తాడు. ఆమె వేశ్య అని తర్వాత తెలిసినా.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా?
ఏడవ తరగతి చదివే సుందరం(కేశవ కర్రి).. తన క్లాస్‌లోని సునీతను ఇష్టపడతాడు. ఆమెతో మాట్లాడించేలా చేయమని వినాయకుడిని కోరుకుంటాడు. ఆమె మాట్లాడుతుంది. అయితే తండ్రి కోపం కారణంగా సునీత ఢిల్లీ బోర్డింగ్ స్కూల్‌లో జాయిన్ అయిపోతుంది. అప్పుడు సుందరం తీసుకునే ఓ ఆవేశమైన నిర్ణయం ఏంటి?
కంచర పాలెం వేదికగా జరిగే ఈ నాలుగు కథలకు ఆధారం ఏమిటి? ఇందులో ఎన్ని జంటలు ఒక్కటయ్యాయి?అనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
సినిమాకు ప్రధాన బలం సినిమా నడిచే నేపథ్యం కాగా.. దాన్ని చక్కగా తెరపై ప్రతిబింబింప చేసిన నటీనటులు ముందుగా అభినందనీయులు. ఎందుకంటే ఒకరిద్దరు మినహా అందరూ కొత్తవారే! అయినా తెరపై వీరు నటించేటప్పుడు ఎక్కడా కొత్తవాళ్లు నటించినట్లు అనిపించదు. ముఖ్యంగా రాజు పాత్రలో నటించిన సుబ్బారావు సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాకు మెయిన్ తన పాత్రే. తను ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పి చేసినా సినిమా బోల్తా పడిపోయేదే. కానీ సుబ్బారావు, ఆయనకు జోడిగా నటించిన రాధ బెస్సి చక్కగా నటించారు. భర్తను కోల్పోయి.. పెళ్లైన 42 ఏళ్ల మహిళ తోడు కోరుకోవడంలో తప్పేంటి? అనేలా రాధా బెస్సి పాత్రలో ఒదిగిపోయారు. అలాగే క్రిస్టియన్ జోసెఫ్, బ్రాహ్మణ యువతి భార్గవి .. భిన్న ధ్రువాలని తెలిసినా ప్రేమపై నమ్మకంతో ప్రేమించుకుంటారు. కానీ బెదిరింపులకు లొంగిపోయినప్పుడు ఎంత గొప్ప ప్రేమ అయినా ఓడిపోవాల్సిందే .. అనేలా ఈ రెండు పాత్రలు కనపడతాయి. ఇక క్రష్, ఎట్రాక్షన్ అనే రెండు పదాలకు అర్థాలు కూడా తెలియని వయసులో అమ్మాయిని ఇష్టపడితే ఏం చేస్తాడు? దేవుడినే నమ్ముకుంటాడు. మరి దేవుడు కూడా ఏం చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటికి కాలమే సమాధానం చెబుతుంది. కానీ చిన్నపిల్లలు దాన్ని గ్రహించేంత పరిణితి ఉండదు. దాని వల్ల తీసుకునే నిర్ణయాలు జీవితాలను తలక్రిందులు చేసేస్తాయి. కేశవ కర్రి, నిత్యశ్రీ చక్కగా నటించారు. ఇక గడ్డం, సలీమా ప్రేమకథ చెప్పాలంటే తామొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని చెప్పే కథవీరిది. నాలుగు జంటల కథలో ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే.. ఇలాంటి కథను రాసుకుని తెరకెక్కించాలని ధైర్యం చేసిన దర్శకుడు వెంకటేశ్ మహాకే వందశాతం క్రెడిట్ దక్కుతుంది. తాను చూసిన వ్యక్తులు.. పరిస్థితులు ఆధారంగా వెంకటేశ్ సన్నివేశాలను చక్కగా రాసుకున్నాడు. ఎక్కడా కమర్షియల్ హంగులకు చోటు ఇవ్వకుండా ఎమోషన్స్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం అదే సినిమాకు ప్రధానబలంగా మారింది. ఇక వరుణ్ చపేకర్, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ కారణంగా ప్రేక్షకుడు నెటివిటీని ఫీల్ అవుతాడు. అలాగే షార్ప్ కట్స్, గొప్ప క్లారిటీ ఉందా అంటే లేదు.. కానీ చక్కగా తీశారు. ఇక స్వీకర్ అగస్థి సింక్ సౌండ్‌లో చేసిన సంగీతం, నేపథ్య సంగీతం బావున్నాయి. నాలుగు కథలకు ఉన్న మెయిన్ పాయింట్‌ను రివీల్ చేయకుండా కథ నడిపిన తీరులో ఎడిటింగ్ పాత్ర ప్రశంసనీయం.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో దర్శకుడు వెంకటేశ్ మహా టచ్ చేసిన పాయింట్ కొత్తగా ఉందనుకుంటే పొరపాటే ... ఒక మెయిన్ పాయింట్‌ను బేస్ చేసుకుని నాలుగు కథలు రన్ అవడమనే కాన్సెప్ట్‌తో తెలుగులో అ!, మనమంతా.. తరహా సినిమాలు వచ్చేశాయి.. అలాంటి కథ, కథనంతో నడిచే సినిమా ఇది. సినిమాకు మరో ఎసెట్ అనుకున్న నటీనటులు కొత్తవాళ్లు.. అయితే అదే మైనస్‌లో కూడా ప్రస్తావించాలి. అందరూ కొత్త ఫేస్‌లే కావడంతో ఆడియెన్ కనెక్ట్ కావడానికి సమయం తీసుకుంటాడనటంలో సందేహం లేదు. సినిమా స్లో నెరేషన్..
విశ్లేషణ:
కొత్త జోనర్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న తరుణంలో కేరాఫ్ కంచరపాలెం రావడం దానికి మంచి పరిణామం. అలాగే ఇలాంటి కథ, కథనాన్ని, దర్శకుడు వెంకటేవ్ మహాను నమ్మి సినిమా నిర్మించిన నిర్మాత విజయ ప్రవీణ పరుచూరిని అభినందించాలి. మరోవైపు ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిన సురేశ్ ప్రొడక్షన్స్‌ను కూడా అభినందించాలి. అసలు ఎక్కడా కమర్షియల్ ఎఫెక్ట్స్, భారీ ఫైట్స్ లేకుండా సినిమా చేయడమే సాహసం. అయితే ప్రేక్షకుడికి చెప్పాలనుకున్న విషయాన్ని హత్తుకునేలా చెప్పాలనే కాన్సెప్ట్ చేసిన ఈ సినిమా ప్రయతాన్ని మెచ్చుకోవాల్సిందే
బోటమ్ లైన్: కేరాఫ్ కంచరపాలెం ... మెప్పించిన మంచి ప్రయత్నం
Comments