Chandramohan:చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

  • IndiaGlitz, [Saturday,November 11 2023]

సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

చంద్రమోహన్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో నటీనటులుగా ఎదిగారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను చంద్రమోహన్ అలరించారని ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని తెలిపారు.

ప్ర‌ముఖ న‌టుడు చంద్ర‌మోహ‌న్ గారు అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూయ‌డం బాధాక‌రం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చంద్ర‌మోహ‌న్ గారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

‘‘ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్‌ పరమపదించారని తెలిసి ఎంతో విచారించా. నాటి చిత్రాలు మొదలు కొని నిన్న మొన్నటి చిత్రాల వరకూ నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సంతాపం తెలియజేశారు.

తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విలక్షణ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్య కారణాలతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. కుటుంబ కథా చిత్రాలంటే చంద్రమోహన్ గారే అన్నట్లుగా.. సాగిన వారి నటనా జీవితం, పొందిన అవార్డులు యువ నటీనటులకు ఆదర్శం.చంద్రమోహన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి తెలిపారు.

చంద్ర మోహన్ గారు కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనను చూపించారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. 'షిర్డీ సాయిబాబా మహత్యం'లో నానావళిగా గుర్తుండిపోయే పాత్ర చేసారు, ఆయనతో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి.అన్నయ్య చిరంజీవి గారితో కలిసి చంటబ్బాయి, ఇంటిగుట్టు లాంటి చిత్రాల్లో నటించారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో మంచి పాత్ర పోషించారు. తమ్ముడు చిత్రంలో మా ఇద్దరి మధ్య అలరించే సన్నివేశాలుంటాయి.900కి పైగా చిత్రాల్లో నటించిన అయన తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చేరువయ్యారు. చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానుఅని జనసేనాని పవన్ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

సీనియ‌ర్ న‌టులు చంద్ర‌మోహ‌న్ గారి మృతి బాధాక‌రం. హీరోగా, కమెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన న‌టుడు చంద్ర‌మోహ‌న్ గారి మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ‌స‌భ్యుల‌కి నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను. నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.