మంత్రులకు శాఖల కేటాయింపులో ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్..

  • IndiaGlitz, [Saturday,June 08 2019]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించారు. ఎవరూ ఊహించని విధంగా.. బహుశా ఫలానా శాఖ వస్తుందని మంత్రులు కూడా ఊహించి ఉండరేమో.. ఆ రేంజ్‌లో జగన్ ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో మంత్రులకు శాఖలు కేటాయింపు జరిగింది. అనూహ్యంగా సుచరితకు కీలకమైన హోంశాఖ బాధ్యతలను అప్పగించడం విశేషం అని చెప్పుకోవచ్చు. కాగా.. నవ్యాంధ్రకు తొలి హోంమంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించబోతున్నారని చెప్పుకోవచ్చు.

డిప్యూటీ సీఎంల విషయానికొస్తే..

వైఎస్ జగన్.. ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆళ్ల నాని, అంజాద్‌ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పుష్పశ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది. వీరికి ఈ డిప్యూటీతో పాటు శాఖలు కూడా కేటాయింపు జరిగింది.

కీలక శాఖలు వీరికే..

బుగ్గన రాజేంద్రనాథ్‌కి ఆర్థికశాఖ, పెద్దిరెడ్డికి పంచాయితీ రాజ్‌శాఖ, బొత్స సత్యనారాయణకు మున్సిపల్ శాఖ, గౌతమ్ రెడ్డికి పరిశ్రమలు, వాణిజ్యశాఖను, అనిల్ కుమార్ యాదవ్‌కు నీటిపారుదలశాఖ బాధ్యతలను అప్పగించడం జరిగింది.

ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు..!

1. ధర్మాన కృష్ణదాస్‌- రోడ్లు, భవనాలు
2. బొత్స సత్యనారాయణ- మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
3. పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
4. అవంతి శ్రీనివాస్‌- టూరిజం
5. కురసాల కన్నబాబు- వ్యవసాయం
6. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌- రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, స్టాంపులు (డిప్యూటీ సీఎం)
7. పినిపే విశ్వపరూప్‌- సాంఘిక సంక్షేమం
8. ఆళ్ల నాని- వైద్య, ఆరోగ్యం (డిప్యూటీ సీఎం)
9. చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహ నిర్మాణం
10. తానేటి వనిత- మహిళా సంక్షేమం
11. కొడాలి నాని- పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
12. పేర్ని నాని- రవాణా, సమాచార శాఖ
13. వెల్లంపల్లి శ్రీనివాస్‌- దేవాదాయ
14. మేకతోటి సుచరిత- హోం, విపత్తు నిర్వహణ
15. మోపిదేవి వెంకటరమణ- పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్‌
16. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి- అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
17. ఆదిమూలపు సురేశ్‌- విద్యా శాఖ
18. అనిల్‌కుమార్‌ యాదవ్‌- ఇరిగేషన్‌
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యం
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గనులు
21. కళత్తూరు నారాయణస్వామి- ఎక్సైజ్‌ (డిప్యూటీ సీఎం)
22. బుగ్గన రాజేంద్రనాథ్‌- ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
23. గుమ్మునూరు జయరామ్‌- కార్మిక, ఉపాధి శిక్షణ
24. షేక్‌ అంజాద్‌ బాషా - మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
25. మాలగుండ్ల శంకర్‌ నారాయణ- బీసీ సంక్షేమం

కాగా.. వీరంతా సక్రమంగా పనిచేస్తే సరే.. లేకుంటే మధ్యలోనే పక్కనెట్టి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని వైఎస్ జగన్ ఇదివరకే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. అయితే అప్పుడు ఎవరెవరికి బెర్త్ కన్ఫామ్ అవుతుందో వేచి చూడాల్సిందే.