Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలిచి వారికి తగు సహాయం చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు.
ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులను స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరగలేదని.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో 42 నుంచి 50 బోట్ల వరకు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలిపారు. రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ చేయనున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగడం దురదృష్టకరమని వెల్లడించారు.
ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో ఉపాధిని కోల్పోయిన మత్స్యకారులకు, మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర మత్స్యకార మంత్రిత్వ శాఖ వివరించానని చెప్పారు. అందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు .
కాగా ఆదివారం అర్దరాత్రి జరిగిన ప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధం కాగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లు, ఓ ఫైర్ టగ్ నౌకతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు దగ్ధం కావడంతో మత్స్యకారులు బోరున విలపించారు. ఒక్కో బోటు ఖరీదు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉంటుందని రూ.కోట్లల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి ఫిషింగ్ హార్బర్‌లో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఘర్షణ తలెత్తి బోటుకు నిప్పు పెట్టినట్లు సమాచారం. దీంతో పరారీలో ఉన్న సదరు యూట్యూబర్, అతని స్నేహితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com