సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. : చిరంజీవి
- IndiaGlitz, [Tuesday,June 09 2020]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దల భేటీ ముగిసింది. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చిరు వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 15 తర్వాత ఏపీలో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో షూటింగ్‌లు స్తంభించిపోయాయని.. తిరిగి షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతిస్తామని జగన్ తమకు హామీ ఇచ్చారని చిరు మీడియా వేదికగా తెలిపారు. షూటింగ్ ఎలా చేసుకోవాలి..? ఏమేం నిబంధనలు పాటించాలి..? అనే విషయాలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను రూపొందిస్తామని జగన్ భేటీలో తెలిపారన్నారు.
జగన్ హామీ ఇచ్చారు..
‘ఏపీలోనూ సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వాస్తవానికి ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలనుకున్నాం. ఇప్పుడు సమయం వచ్చింది కలిశాం. కరోనా కారణంగా షూటింగ్‌లు ఇబ్బంది పడ్డాం. థియేటర్ల మినిమం ఫిక్స్‌డ్ ఛార్జీలు ఎత్తేయాలని జగన్‌ను కోరాం. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి వెన్నంటే ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. టికెట్ల ధరలు, ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం. జగన్ మేం చెప్పిన విషయాలకూ సానుకూలంగా స్పందించారు. అలాగే 2019-20 నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు’ అని మెగాస్టార్ మీడియా ముఖంగా వెల్లడించారు. కాగా ఇవే కాకుండా.. వినోదపన్ను మినహాయింపు, రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి అవసరమైన వసతుల కల్పన, భూములపై రాయితీ, చిత్ర నిర్మాణాలకు ప్రోత్సాహకాలు, ప్రత్యేక అనుమతులు వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.