CM Jagan: నన్ను బచ్చా అంటున్న చంద్రబాబు పొత్తులతో ఎందుకు వస్తున్నాడు: సీఎం జగన్

  • IndiaGlitz, [Saturday,April 20 2024]

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా చింతపాలెంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఒక బచ్చా అని కూడా అంటున్నాడు. అయితే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, పూతన, కాళిందిని చూస్తే బాబు గుర్తుకు వస్తున్నారు. రాముడ్ని బచ్చా అనుకున్న సుబాహుడు, మారీచుడు ఇప్పుడు రామోజీ వేషంలోనూ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేషంలోనూ కనిపిస్తున్నారు. హనుమంతుడ్ని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్లను చూస్తే గుర్తుకొస్తున్నాడు. నేను బచ్చా అయినా ఒంటరిగా, ధైర్యంగా పోటీ చేస్తున్నాను. బచ్చా అయితే నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి ప్రశ్నించారు.

జగన్‌ను ఓడించాలని వారు... పేదలను గెలిపించాలి, ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ పోరాటంతో 2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. అందుకు మీరంతా సిద్ధమేనా? మన ఈ సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయి. ఆ ఉక్రోషం, కడుపుమంట భగ్గుమని చంద్రబాబు నాపై రాళ్లు వేయమంటున్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇదీ చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మల అజెండా. దీనికోసం వాళ్లకు అధికారం కావాలట... జగన్ ను కొట్టడానికి, జగన్ కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలట.

నేను బచ్చా అయితే... ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వొక్కడివే రావడానికి నీకు ధైర్యం చాలడంలేదు... అరడజను మందిని వెనకేసుకుని వస్తున్న నిన్ను ఏమనాలి? నేను బచ్చా అయితే... ఈ 58 నెలల్లో గ్రామాలకు, రైతులకు, పేదలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు, అవ్వాతాతలకు, సామాజిక వర్గాలకు నేను చేసిన మంచి, ఇంటింటికీ చేసిన అభివృద్ధి... నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎందుకు చేయలేకపోయావు బాబూ? నిన్ను ఏమనాలి? అంటూ నిలదీశారు.

మీ బిడ్డ అధికారంలోకి రాకముందు ఇలాంటి పధకాలు అందాయా? ఇది జగన్ మార్క్ పాలన. చంద్రబాబు మార్క్ పాలన ఏముంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేర్చి అందరికీ అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నాం. ప్రజలకు ఇంత మంచి చేసిన ప్రభుత్వం కావాలా? కేవలం నలుగురు దోచుకుని తినే ఆ చంద్రబాబు కావాలా? మీరే తేల్చుకోవాలి అని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.