NPR పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
- IndiaGlitz, [Tuesday,March 03 2020]
యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ల విషయమై ఆందోళనలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఎన్పీఆర్‌కు మొదట పార్లమెంట్‌లో వైసీపీ మద్దతు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దానిపై పునరాలోచన చేసి మద్దతు వెనక్కి తీసుకుంది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ రెండింటికీ వ్యతిరేకంగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లారిటీగా చెప్పారు. తాజాగా మరోసారి ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అభద్రతా భావం..!
‘జాతీయ జనాభా పట్టికలో (ఎన్పీఆర్) ప్రతిపాదించబడ్డ కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయి. ఎన్పీఆర్ అంశంపై పార్టీలో విస్తృతమైన చర్చ జరిపాం. ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతాం. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం కూడా చేస్తాం’ అని ట్విట్టర్‌లో వైఎస్ జగన్ రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్‌పై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.