YS Jagan: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి.. ప్రజలకు సీఎం జగన్ పిలుపు..
Send us your feedback to audioarticles@vaarta.com
చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిపోతుందన్న విషయాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలని సీఎం జగన్ తెలిపారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మీ బిడ్డ చేస్తున్న సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టేందుకు అన్ని పార్టీలు కూటమిగా వస్తున్నాయి అని తెలిపారు.
"పేదవాడి బతుకును చీకటి నుంచి వెలుగుకు తీసుకుపోతుంటే, మాయలమారి పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా.? 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్సభ స్థానాలు... మొత్తమ్మీద 200కి 200 స్థానాల్లో గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా..? అని అడుగుతున్నా. మళ్లీ నారావారి పాలన తెస్తామంటున్నారు. అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..? అని అడుగుతున్నాను. నరకాసురుడు, రావణుడు, ధుర్యోధనుడు కలిశారు. సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి.
ఇటు జగన్ ఒక్కడే... అటు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ వాళ్లు ఏకమయ్యారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా కూడా వారికే వత్తాసు పలుకుతోంది. వారిని అడ్డుకునేందుకు ప్రజలంతా సిద్ధమేనా? ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు... ఇప్పటివరకు జరిగిన ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లకు కూడా కొనసాగించే ఎన్నికలు ఇవి. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి వెళుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. అందుకే ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నా. ఈ ఎన్నికలు మన పార్టీకి ఓ జైత్రయాత్ర అయితే, మోసాలబాబుకు చివరి ఎన్నికలు కావాలి.
ఇంట్లో ఉన్న మీ అక్కచెల్లెమ్మలతో, మీ అవ్వా తాతలతో కూర్చుని ఆలోచన చేయండి. మీకు ఎవరి పాలనలో మంచి జరిగిందో, మీ ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండి. 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎక్కడా లేని విధంగా వాలంటీరు వ్యవస్థను తీసుకువచ్చాం. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువులు అందుబాటులోకి తీసుకువచ్చాం. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, కాపు నేస్తం, జగనన్న తోడు, నేతన్న నేస్తం, ఆసరా, మత్స్యకార చేయూత... ఇలా మునుపెన్నడూ లేనంత సంక్షేమం అందిస్తున్నాం" అని జగన్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com