ఫిషింగ్ హార్బర్ బాధితులకు అండగా సీఎం జగన్.. భారీగా పరిహారం ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి సిదిరి అప్పలరాజుకి ఆదేశాలను జారీచేశారు. బాధితులు తిరిగి తమ జీవితాలను నిలబెట్టుకునేలా అండగా ఉండాలని సూచించారు. కష్టకాలంలో వారికి పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ చేయించుకునేలా మత్స్యకారులకు అధికారులు తగిన తోడ్పాటు అందించాలన్నారు. దీంతో మత్స్యకారులను పరామర్శించిన మంత్రి.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా, మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే మత్స్యకారులు మాత్రం రూ.30 కోట్ల రూపాయలకు పైనే నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వాటిలో రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల విలువైన బోట్లు కూడా ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా కొన్ని బోట్లలో రూ. 5లక్షలకు పైగా విలువ చేసే చేపలు కూడా దగ్ధమయ్యాయని వాపోతున్నారు.
కాగా ఆదివారం అర్దరాత్రి జరిగిన ప్రమాదంలో బోట్లు దగ్ధం కాగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లు, ఓ ఫైర్ టగ్ నౌకతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు దగ్ధం కావడంతో మత్స్యకారులు బోరున విలపించారు. ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిషింగ్ హార్బర్‌లో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఘర్షణ తలెత్తి బోటుకు నిప్పు పెట్టినట్లు సమాచారం. దీంతో పరారీలో ఉన్న సదరు యూట్యూబర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com