Revanth Reddy: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు.. హరీష్ రావు కౌంటర్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పమని ముందుకొచ్చి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే, బీఆర్ఎస్ విజయం అని తెలిపారు. తమపై బురద చల్లేందుకు, ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని మండిపడ్డారు. సీఎం రేవంత్.. సభలో రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారని హరీశ్‌రావు అనడంతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు జీవనాధారం అయిన కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. హబూబ్ నగర్ జిల్లా నుంచి 10 లక్షల మందిపైగా వలస వెళ్లారని.. 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరిమితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపమని ఆదరించి ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు. ఇవాళ ఆ జిల్లాకు సంబంధించిన కీలక చర్చ జరుగుతుంటే శాసనసభకు రాకుండా ఫాంహౌస్ పడుకుని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై తాము పెట్టిన తీర్మానానికి అనుకులామా, వ్యతిరేకమా అనేది బీఆర్ఎస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ వ్యాఖ్యలను హరీశ్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని విమర్శించారు. కేసీఆర్ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడని.. సిద్ధిపేట, గజ్వేల్, కరీంనగర్, మహబూబ్‌నగర్.. ఎక్కడా ఓడిపోలేదన్నారు. మరి రేవంత్‌ను కొడంగల్ నుంచి తరిమితే మల్కాజ్‌గిరికి వచ్చారని కౌంటర్ ఇచ్చారు.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ నల్లగొండను మోసం చేసినందుకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు కలిసి దక్షిణ తెలంగాణ మొత్తానికి అన్యాయం చేశారన్నారు. తక్షణమే కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని. లేకపోతే నల్గొండలో కాలు పెట్టే అర్హత లేదని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చూసిన తరువాత మీ తలకాయ్ ఎక్కడ పెట్టుకుంటారు అంటూ నిలదీశారు.
ఈ వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీని కూడా అమేథీ నుంచి చెప్పుతో కొట్టినట్లే కదా అని ప్రశ్నించారు. వెంటనే చెప్పుతో కొడుతా అనే మాటలను సభ రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. దీంతో ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మొత్తానికి ఇరు పక్షాల నేతల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments