CM Revanth Reddy:అసెంబ్లీలో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  • IndiaGlitz, [Saturday,February 17 2024]

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో తన పాత్రను పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి.. తెలంగాణ పునర్నిర్మాణంలో వారి పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా సభను సజావుగా నడవడానికి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నా అని వెల్లడించారు.

అంతకుముందు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయ ప్రతినిధి ద్వారా ఒక లేఖను, పుష్పగుచ్ఛాన్ని పంపించారు. సీఎం కేసీఆర్‌ తరఫున మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆ లేఖను, పుష్పగుచ్ఛాన్ని అందుకున్నారు.

తెలంగాణ స్పాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, సుపరిపాలకుడు, ఉద్యమ నేత కేసీఆర్ గారు. కారణజన్ముడుగా, చిరస్మరణీయుడుగా, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడుగా ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని మాజీ మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

మరోవైపు కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమక్షంలో 70 కేజీల కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యకమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్‌లు, ఇతర ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కింద లక్ష రూపాయలు అందజేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. పలు చోట్ల రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు చేశారు.