CM Revanth Reddy:మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తుంటి ఎముక సర్జరీ చేయించుకుని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్‌ను ఆయన పరామర్శించారు. రేవంత్ వెంట మంత్రి సీతక్క, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. వారి కంటే ముందు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన సీఎంను మాజీ మంత్రి కేటీఆర్ దగ్గరుండి కేసీఆర్ చికిత్స పొందుతున్న గదికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
అనంతరం ఆసుపత్రి బయటకు వచ్చిన రేవంత్ మీడియా మాట్లాడుతూ కేసీఆర్ త్వరగా కోలుకుని తప్పకుండా అసెంబ్లీకి రావాలని కోరినట్లు చెప్పారు. అసెంబ్లీలో ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడాలని.. వారి సూచనలు, సలహాలు తమకు అవసరమని పేర్కొన్నారు. ఆయన వైద్యానికి సంబంధించి అన్ని సహకారాలు అందించాలని సీఎస్‌ను ఆదేశించినట్లు రేవంత్ వెల్లడించారు.
కాగా గత గురువారం అర్థరాత్రి కేసీఆర్.. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నివాసంలో కాలు జారి కింద పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్‌తో పోలీసుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీచేశారు. ఆసుపత్రికి చేరుకోగానే వెంటనే పరీక్షలు నిర్వహించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగిందని గుర్తించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. వైద్యులు వాకర్ సాయంతో ఆయనను నడిపించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీతో సహా ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments