Revanth: ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
- IndiaGlitz, [Monday,April 29 2024]
ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని గుర్మిట్కల్‌లోని ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ సర్కార్ ఇప్పటివరకు ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తోందని.. ఈసారి కొత్తగా ఢిల్లీ పోలీసులను పంపించిందని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవరూ భయపడే వారు లేరని స్పష్టంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటలో బీజేపీని ఓడించి తీరుతామని సవాల్ విసిరారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారని.. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో లక్ష మెజారిటీతో గుర్మిట్కల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. గుర్మిట్కల్ నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే ఎన్నికయ్యారని తెలిపారు. మీరు ఎన్నుకున్న ఖర్గే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని... ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామన్నారు.
ప్రధాని మోదీ పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారని మండిపడ్డారు. 40 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించిన మోదీ.. ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదన్నారు. 2019 ఎన్నికలక్లో కర్ణాటక నుంచి 26 మంది ఎంపీలను గెలిపిస్తే.. మోదీ కర్ణాటకకు ఇచ్చింది కేవలం ఒకటే కేబినెట్ పదవి అని తెలిపారు. మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు తప్ప ఇచ్చింది ఏం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు వస్తే కనీసం బెంగుళూరుకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. అందుకే మోదీకి కన్నడ ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు.
కాగా ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. సిద్దిపేట సభలో మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నేతల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు.