CM Revanth Reddy:ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
- IndiaGlitz, [Friday,December 08 2023]
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగానే ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్(పాత ప్రగతిభవన్) వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వయంగా స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శుక్రవారం ఉదయం నుంచి ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు అక్కడి వచ్చి తమ సమస్యలు విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు.
దీంతో రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు ప్రజాభవన్‌కు బారులు తీరారు. అధికారులు ప్రజల ఆధార్ కార్డులను పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సీఎం హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు. దివ్యాంగులు లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారిని ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పోలీసులు స్వయంగా లోపలికి తీసుకెళుతున్నారు.
మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో నిల్చున్న వారికి వాటర్ బాటిళ్లు, మజ్జిగ వంటివి పంపిణీ చేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ఇక్కడి వచ్చామని.. సీఎం స్వయంగా తమ సమస్యలు పరిశీలించటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రారంభం కానుంది.