CM Revanth Reddy:విద్యుత్ కుంభకోణాలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మూడవ అసెంబ్లీ తొలి సమావేశాలు(Telangana Assembly Sessions) హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలంపై కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఆర్థికస్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన సర్కార్.. నేడు విద్యుత్ శాఖపై వైట్ పేపర్(White Paper) సభ ముందు ఉంచింది. ఈ సందర్భంగా ఆర్థిశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని.. పరిశ్రమలు, వ్యవసాయ, సేవారంగాల అభివృద్ధికి విద్యుత్ సరఫరాయే వెన్నెముకని తెలిపారు. అలాంటి విద్యుత్ సంస్థలను భారీ నష్టాల్లోకి తీసుకెళ్లి తమకు అప్పగించారని మండిపడ్డారు.
భట్టి తెలిపి శ్వేతపత్రం లెక్కల ప్రకారం.. "డిస్కంల నష్టాల మొత్తం రూ 62,461 కోట్లు. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ 28,673 కోట్ల బకాయిలు చెల్లించాలి. డిస్కంల ఆర్థిక సమస్యలకు కారణం వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ 28,842 కోట్ల బకాయిలు. ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు రూ 14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద రూ 14,928 కోట్ల భారం మోపింది"అని తెలిపారు.
తెలంగాణ ఏర్పడేనాటికి టీఎస్ జెన్‌కోలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు ఉందన్నారు. అయితే రాష్ట్రం ఏర్పాటు కంటే ముందే తెలంగాణలో 2,960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రణాళికలు, పనులను ఉమ్మడి ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అవే నాణ్యమైన విద్యుత్తు అందించడంలో కీలక పాత్ర పోషించాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేసిందని పేర్కొన్నారు. బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు చేపట్టి అతి పెద్ద తప్పిదం చేశారన్నారు. దీనికి కేవలం బొగ్గు సరఫరాకే సంవత్సరానికి రూ.800 కోట్లు అవుతుందని భట్టి వెల్లడించారు .
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి రూ.10వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ప్రాజెక్టు ఇవ్వడమే పెద్ద కుంభకోణమని.. బీఆర్ఎస్ సర్కారు 24 గంటల కరెంట్ ఎప్పుడూ ఇవ్వలేదని వెల్లడించారు.
కోమటిరెడ్డి ఆరోపణలపై స్పందించిన జగదీశ్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో విద్యుత్‌పై ధర్నాలు చేయలేదని.. ఒక్కరోజు కూడా పవర్ హాలిడే ఇవ్వలేదని స్పష్టం చేశారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి ప్రాజెక్టుతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపైనా ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com