CM Revanth Reddy: ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఆయన ప్రారంభించారు. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను ప్రజలకు అంకితమిచ్చారని తెలిపారు. సోనియాపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని.. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజాపాలన ఉద్దేశమన్నారు.
అభయహస్తం గ్యారెంటీల్లో భాగంగా నేడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించామన్నారు. మహిళల కళ్లలో ఆనందం చూడాలనే లక్ష్యంలో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా అర్హులైన పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధివిధానాలు రూపొందించారని చెప్పారు. సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనం అని పేర్కొన్నారు.
గృహజ్యోతి పథకం ద్వారా తెలంగాణలోని 83 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.3,400 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. మార్చి మొదటివారం నుంచి జారీచేసే విద్యుత్ బిల్లులకు సంబంధించి 200 యూనిట్ల లోపు వాడే అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. దరఖాస్తుల్లో కార్డు నంబర్లు, విద్యుత్ కనెక్షన్ నంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునే అవకాశం ఇవ్వనున్నారు. విద్యుత్ బిల్లుల కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లలో ఈ సవరణ ప్రక్రియలు చేపడతారు.
ఇదిలా ఉంటే రూ.500లకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం మూడు మార్గదర్శకాలను ప్రకటించిన తెలిసిందే. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారి జాబితా ఆధారంగా 39.5 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. మూడు సంవత్సరాల గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు. వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఆ తరువాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ చేస్తారు. సబ్సిడీని ప్రభుత్వం నేరుగా OMC సంస్థలకు ఇవ్వనుంది. అనంతరం 48 గంటల్లోనే సంస్థల నుంచి వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments