సీఎం రేవంత్ రెడ్డి నా మిత్రుడు.. ఇద్దరం కలిసి పనిచేశాం: మల్లారెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
మల్కాజ్గిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తాను మంచి మిత్రులమని వ్యాఖ్యానించారు. ఇద్దరం గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశామని గుర్తు చేశారు. త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తానని తెలిపారు. తన నియోజకవర్గంలో కీసర ఆలయం కార్యక్రమానికి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. అయితే ఎన్నికలకు ముందు మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తొడగొట్టి మరీ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదని.. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని చెప్పుకొచ్చారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ అడిగారని.. అయితే తనకు ఆసక్తి లేదని చెప్పినట్లు వివరించారు. తన కుమారుడు భద్రారెడ్డిని బరిలోకి దింపాలని అనుకుంటున్నానని స్పష్టంచేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇటీవల ప్రకటించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని.. ప్రజల ఆశీర్వాదంతో ఒకసారి మంత్రిగా కూడా చేశానని చెప్పారు. భవిష్యత్తులో రాజకీయాల్లో లేకపోయినా ప్రజాసేవ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
కాగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మల్కాజిరి జిల్లా చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల ఎస్టీల వారసత్వ భూమిని కబ్జా చేశారని భిక్షపతి అనే వ్యక్తి శామీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించాడు. దాదాపు రూ.250కోట్ల విలువైన భూమిని కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మల్లారెడ్డితో పాటు శామీర్‌పేట ఎమ్మార్వో, ఆయన అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపైనా కేసు నమోదుచేశారు. ఈ కేసుపై మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా విచారణ వాయిదా వేసింది. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout