CM Revanth Reddy:ప్రజల వద్దకే పాలన.. మరో వినూత్న కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

  • IndiaGlitz, [Saturday,December 23 2023]

తెలంగాణలో తనదైన పాలనతో దూసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి, అక్కడే సమస్యలకు పరిష్కారం చూపేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీని ద్వారా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేలా కసరత్తు చేస్తు్న్నారు.

ప్రజాపాలన ద్వారా విద్య, వైద్యం, భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత పది రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ప్రజల స్పందన బట్టి మరోసారి నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు ఈనెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500కు గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.2,500 నగదు, పెన్షన్ల పెంపు, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు.

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమీక్షలు, సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. ప్రజాపాలన అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 'ప్రజా వాణి' నిర్వహిస్తున్నారు. ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. అయితే భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు, వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయి. దీంతో మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల కోసం జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు రావడం సమంజసం కాదని.. అందుకే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో రేపు(ఆదివారం) అన్ని జిల్లాల కలెక్టర్లతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.