Gaddar Statue: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి HMDA ఆమోదం తెలిపింది. దీంతో విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా రామచంద్రాపురంలో నిర్మించిన గద్దర్ విగ్రహాన్ని జనవరి 31న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆవిష్కరించాల్సి ఉంది. అయితే విగ్రహం ఏర్పాటు చేస్తున్న స్థలం HMDA పరిధిలోకి వస్తుందని కొంత మంది అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో గద్దర్ విగ్రహావిష్కరణకు బ్రేక్ పడింది.
సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లడంతో ఆయన కలుగజేసుకుని విగ్రహ ఏర్పాటుకు అనుమతి లభించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంపై ప్రజా సంఘాలు, ఉద్యమకారులు హర్షం చేస్తున్నారు. గతంలో గద్దర్ విగ్రహ ఏర్పాటు చేస్తానని రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు.
గతేడాది అనారోగ్యంతో గద్దర్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించినప్పటి నుంచి టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరుండి సొంత మనిషిలా అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్.. భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలను ముందుండి నిర్వహించారు.
కాగా ప్రజాగాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గద్దర్ తన కుమారుడు సూర్యను రాజకీయాల్లో తీసుకురావాలని ప్రయత్నించారు. దీంతో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడారు. ఖమ్మంలో జరిగిన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గద్దర్‌ను దగ్గరికి తీసుకుని అప్యాయంగా పలకరించారు.
అయితే కుమారుడిని రాజకీయాల్లో చూడాలన్న కోరిక తీరకుండానే గద్దర్ ప్రాణాలు వదిలారు. దాంతో గద్దర్ కోరికను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. గద్దర్ కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. కుమారుడికి బదులుగా ఆయన కుమార్తె వెన్నెలకు సికింద్రాబాబ్ కంటోన్మెంట్ టికెట్‌ను కేటాయించగా.. ఆమె ఓడిపోయారు. అయినా కానీ గద్దర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూనే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments