CM Revanth Reddy:అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆటో రాముడు జూనియర్ ఆర్టిస్ట్ లాగా డ్రామాలు చేశారని.. ఆటోలో వెళ్లి కేటీఆర్ నాటకాలు చేశారని ఎద్దేవా చేశారు. ఆటోలో కెమెరాలు పెట్టుకొని ప్రీ ప్లాన్డ్గా ఆటోలో తిరిగి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని.. ఆటోవాలాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కవులు, కళాకారులకి నిలయం అనుకున్నా కానీ నటులకు కూడా నిలయం అని అర్థమైందన్నారు. మరో నటుడు ఉన్నారు.. ఆయనేమో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నారు కానీ పది పైసలతో అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయారని హరీష్ రావును ఉద్దేశించి సెటైర్లు వేశారు.
అలాగే గవర్నర్ ప్రసంగం రోజూ, ఇప్పుడు చర్చ జరుగుతున్న సమయంలో కూడా కేసీఆర్ సభకు రాలేదన్నారు. కేసీఆర్ లాంటి అనుభవం ఉన్న వ్యక్తి సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని అశించామన్నారని తెలిపారు. కానీ 80వేల పుస్తకాలు చదివిన అపర మేధావి సభకు రాకపోవడం తమను నిరుత్సాహపరిచిందన్నారు. నాడు ఉద్యమ సమయంలో APని చెరిపేసి TG అని రాసుకున్నామని.. రాష్ట్రం విడిపోయినప్పుడు TG అని ఉండాలని కేంద్రం చెబితే తన పార్టీ పేరుగా ఉంటుందని TS అని పెట్టారని మండిడ్డారు. అలాగే రాష్ట్ర అధికార చిహ్నంలో ఫ్యూడల్ గుర్తులు ఉందొద్దని మార్చాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఇక నీటి ప్రాజెక్టులపై మాట్లాడుతూ ఏపీ నేతల పులసు తిని వారికి అలుసుగా కేసీఆర్ ప్రాజెక్టులు అప్పగించారని విమర్శించారు. ఆ రాష్ట్ర మంత్రి రోజా ఇంట్లో రాగి సంగటి, రొయ్యల పులుసు తినొచ్చి ప్రాజెక్టులను ఏపీకి అప్పగించారంటూ ధ్వజమెత్తారు. ప్రాజెక్టులపై దమ్ముంటే నల్లగొండలో కాదు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలని కోరారు. ఏపీలో ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణలో మాత్రం రెండు టీఎంసీలను కూడా తరలించలేకపోయారన్నారు. పోలింగ్ రోజు ఏపీ సీఎం జగన్ మన ప్రాజెక్టులపై తుపాకి పెట్టి నీరు తరలించుకుపోతుంటే ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సహకారం లేకుండానే సాగర్ డ్యామ్ పైకి ఏపీ పోలీసులు రాగలరా? అని ప్రశ్నించారు. కృష్ణా నది జలాలపై కేంద్ర ప్రభుత్వానికి పెత్తనాన్ని అప్పగించింది కేసీఆర్ అవునా? కాదా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై జరిగిన అవినీతిని పక్కదోవ పట్టించడానికి కృష్ణా జలాల వివాదాన్ని తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు. ఈ ఐదేళ్లలో జగన్ ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నా కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప అడ్డుకోలేదని దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాజెక్టులకు బీజం పడింది ప్రగతి భవన్లో మీ డైనింగ్ టేబుల్ మీద కాదా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎప్పటి నుంచో స్నేహం ఉందని కూడా వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కొంత మంది మంత్రులు అవిశ్వాసం ప్రకటించి.. కేటీఆర్‌ను సీఎం చేయాలని చూశారని ఆరోపించారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక కేసీఆర్.. మోదీ దగ్గరకు వెళ్లి కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పారనే విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పదేళ్లలో మోదీ తీసుకువచ్చిన చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిన విషయాన్ని కూడా రేవంత్ గుర్తు చేశారు. పదేళ్లు రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి అధికారం పంచుకున్నాయని విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments