CM Revanth Reddy:కొడకల్లారా టచ్ చేసి చూడండి.. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ "కొడకల్లారా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి.. మా కార్యకర్తలు అగ్గి కణికలై, మానవ బాంబులై.. నా కొడకల్లారా.. ఎవరైన మిగిల్తే చూస్తా.. ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కి పేగులు బయటకు తీసి మెడలేసుకుని ఊరేగుతాం.." అంటూ తీవ్ర పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తే.. పేదేళ్ల ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరా? 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా? అని ప్రశ్నించారు.
పదేళ్లు పాలించిన వారు రెండు నెలలకో ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారని మండిపడ్డారు. ఎవరైనా తోక జాడిస్తే కత్తిరించే కత్తెర తన చేతిలోనే ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడమే బీఆర్ఎస్ విధానమా? అని ఫైర్ అయ్యారు. 1994-2004 వరకు టీడీపీ పదేళ్లు.. 2004-14 వరకు కాంగ్రెస్, 2014-2023 వరకు బీఆర్ఎస్ వరుసగా అధికారంలో ఉన్నాయని.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మరో పదేళ్లు అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణను లూటీ చేసిందని ఆరోపించారు.
కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కేసీఆర్ అలా చేయలేదు కానీ మందేసి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ఒంట్లో బాలేక అసెంబ్లీకి రాలేదని చెబుతున్నారని... మరి నల్గొండ సభకు ఎలా వెళ్లారు? అని నిలదీశారు. తమ ప్రభుత్వం మీదకు ఎవరైనా వస్తే తొక్కుకుంటూ వెళ్లి బొంద పెడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటే.. బిల్లా రంగా సమితి అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్ రావు బిల్లా రంగాల మాదిరిగా ఇష్టమున్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
ప్రధాని మోదీకి ఎందుకు వినతిపత్రాలు ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని.. అతిథి ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని కౌంటర్ ఇచ్చారు. తానేమి తలుపులు మూసి మోదీ కడుపులో తలపెట్టలేదని.. చెవులో గుసగుస పెట్టలేదని.. అందరి ముందే తెలంగాణ అభివృద్ధి చేయమని అడిగానని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే.. తెలంగాణ నుంచే కాదు అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానని వెల్లడించారు.
తనకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తలే ముఖ్యమని తరచూ నేతలకు చెబుతుంటానని గుర్తుచేసుకున్నారు.
అప్పట్లో పాలమూరు బిడ్డ అయిన బూర్గుల రామకృష్ణారావును దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ముఖ్యమంత్రి చేశారని.. ఇప్పుడు సోనియా గాంధీ తనకు అవకాశం ఇచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. తాత, తండ్రి పేరు చెప్పుకొని తాను రాజకీయాల్లోకి రాలేదని కేటీఆర్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని చెప్పుకొచ్చారు.
గత మూడు నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కష్టపడుతున్నామని వివరించారు. 90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని.. గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని.. తమ 90 రోజుల పాలనకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రెఫరెండమని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout