అవును.. గుంపు మేస్త్రీనే.. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

  • IndiaGlitz, [Thursday,January 25 2024]

తనను గుంపు మేస్త్రీ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవును నేను మేస్త్రీనే.. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్మించిన మేస్త్రీనే అని కౌంటర్ ఇచ్చారు. మిమ్మల్ని గోరి కట్టే మేస్త్రీని నేనే అని హెచ్చరించారు. బిడ్డల్లారా కాస్కోండి.. ఈ నెలాఖరులో ఇంద్రవల్లి వస్తున్నానంటూ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్ లెవల్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ నెహ్రూ కుటుంబం త్యాగాలతోనే దేశం అభివృద్ధి చెందిందన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని చెప్పారు. మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తాను సీఎం పదవిలో ఉన్నానని ఆయన తెలిపారు. బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్) చాలా మాట్లాడుతున్నారని.. ఛార్లెస్ శోభరాజ్(కేసీఆర్) దుప్పటి కప్పుకుని ఇంట్లో పడుకుని ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులను కేసీఆర్ అమ్ముకుంటే.. తాము మాత్రం ఉద్యమకారులకు పదవులు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి యాభై రోజులు కూడా కాలేదని.. అప్పుడే హామీలు అమలు చేయాలని గోల చేస్తు్న్నారని మండిపడ్డారు. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేశామని.. మరో రెండు పథకాలను ఫిబ్రవరిలోనే అమలు చేయనున్నట్లు స్పష్టంచేశారు. అలాగే ఫిబ్రవరి నెలాఖరులోగా అందరికీ రైతు భరోసా నిధులు అందజేస్తామని రేవంత్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.

ఇక మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు కురిపించారు. గతంలో మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు.. నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విషయాన్ని తీసుకువస్తారని ఎద్దేవా చేశారు. ఓసారి పాకిస్తాన్‌ను బూచీగా చూపిస్తారని... మరోసారి దేవుడ్ని వాడుకుంటారని విమర్శించారు. సామాన్యుల ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్‌ గాంధీ న్యాయ యాత్ర చేస్తున్నారని.. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యథిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.