మంటల్లో ఇరుక్కున్న కార్మికులను కాపాడిన బాలుడు.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ శివారు షాద్‌నగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం 50 మంది కార్మికుల ప్రాణాలు కాపాడింది. దీంతో ఆ బాలుడి సాహసాలను అందరూ ప్రశంసిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాలుడిని అభినందించారు. యువకుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.
అసలు ఏం జరిగిందంటే.. షాద్‌నగర్‌లోని నందిగామ వద్ద ఉన్న అలెన్ హోమియో అండ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా.. నిప్పురవ్వలు ఫైబర్ షీట్లపై పడి మంటలు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లోనే ఆ మంటలు పెద్ద రేకుల షెడ్ మొత్తానికి వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలు సుమారు 300 మంది కార్మికులు ఉండగా.. ఎగిసిపడిన మంటలను చూసి ప్రాణ భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.
అయితే మంటలు ఎగిసిపడటంతో సుమారు 50 మంది కార్మికులు లోపలే ఇరుక్కుపోయారు. అదే సమయంలో స్థానిక బాలుడు సాయిచరణ్ సమయస్ఫూర్తితో ఆలోచించి పెద్ద సాహసమే చేశాడు. ఒక పెద్ద తాడుతో భవనంపైకి ఎక్కి కిటికీకి దాన్ని కట్టాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న 50 మంది కార్మికులు తాడు సాయంతో కిందికి దిగారు. లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. దీంతో సాయిచరణ్ సమయస్పూర్తిని, ధైర్యాన్ని పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు.
సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి బాలుడిని అభినందించారు. రియల్ హీరో సాయిచరణ్ అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ బాలుడికి రూ.10వేలు ఇస్తుండగా వద్దని చెప్పడం విశేషం. ఇలాంటి యువకులే దేశానికి, రాష్ట్రానికి కావాలంటూ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com