CM Revanth Reddy:కేటీఆర్ చిప్పకూడు తింటాడు.. ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth) Reddy) స్పందించారు. వాల్మీకి బోయలతో సమావేశమైన ఆయన ట్యాపింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తాగుబోతులా, అచ్చోసిన అంబోతులా మాట్లాడుతున్నారని.. ఫోన్ల సంభాషణ వింటామని.. వింటే ఏమవుతుందని సిగ్గు లేకుండా అంటున్నారని మండిపడ్డారు. అలా ఫోన్ సంభాషణలు వింటే చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడంటూ హెచ్చరించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయ్యొద్దని చెప్పినా అధికారులు వినిపించుకోకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నారని తెలిపారు. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలన్నారు. భార్యభర్తల ఫోన్ కాల్స్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ అంటున్నారని.. మంది సంసారాల్లో వేలు పెట్టి చూడాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోందని.. కచ్చితంగా కేటీఆర్‌పై చట్టప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ వందరోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో తమ పాలనను మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని.. మొదటి నెల 4వ తేదీన, రెండో నెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలందరూ స్వేచ్ఛగా రాష్ట్ర సచివాలయానికి వచ్చి సమస్యలను ప్రస్తావిస్తున్నారని.. తక్షణమే వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు.
కాగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డిసిపి రాధా కిషన్ రావు, సీఐ గట్టు మల్లును అరెస్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు న్యాయమూర్తులు, రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వం వేగంగా దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ మాట్లాడుతూ ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments