స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం!

  • IndiaGlitz, [Thursday,March 18 2021]

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లలో కరోనా విజృంభిస్తోంది. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతో తెలంగాణలో స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభిస్తుండటంతో కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఆయన సీఎస్ సోమేష్‌కుమార్, విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి స్కూళ్లు కొనసాగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో 1-8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పరీక్షపై కేసీఆర్ త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో తిరిగి కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కాగా.. నేడు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ కరోనా విషయంలో గతంలో చేపట్టిన చర్యలను గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. కరోనాపై ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి సూచనలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. విద్యాసంస్థల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.