BRS పేరుతో కొత్త జాతీయ పార్టీ.. ప్లీనరీలో కేసీఆర్ సంకేతాలు

  • IndiaGlitz, [Wednesday,April 27 2022]

జాతీయ రాజకీయాల్లో ఎలాగైనా చక్రం తిప్పాలని భావిస్తోన్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే థర్డ్ ఫ్రంట్‌పై రకరకాల ప్రయత్నాలు చేయడంతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలను కూడా కలిశారు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. దేశాన్ని సరైన దిశలో నడిపించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలం అయ్యాయని, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక రావాల్సిన అవసరాన్ని కేసీఆర్ చాలా కాలంగా చెబుతున్నారు. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించడం లేదు. అయితే ఇప్పుడు కేసీఆర్‌కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోడుకావడంతో సీన్ మరోలా మారబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఎదగాలనే లక్ష్యం వైపు సాగేలా జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ శక్తి ఏర్పాటు కావాలన్నారు. రాజకీయ ఫ్రంట్‌ల వల్ల ఏం జరిగిందని ప్రశ్నించిన కేసీఆర్.. జరగాల్సింది రాజకీయ పునఃరేకీకరణ కాదని వ్యాఖ్యానించారు.

దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ అజెండా, దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లే సిద్ధాంతమన్నారు. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలను కొందరు ఇస్తున్నారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఎలాగైతే సాధించామో.. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ప్రక్రియ జరగాల్సి ఉందన్నారు. తాను పెట్టాలనుకుంటే భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటుందని ఇటీవలి జార్ఖండ్ పర్యటన సందర్భంగా తెలియజేశానని కేసీఆర్ గుర్తుచేశారు.