Telangana Formation Day: తెలంగాణ కళ్లు తెరవని క్షణం నుంచే వివక్ష.. కేంద్రంపై కేసీఆర్ ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
స్వరాష్ట్రం సాధించిన ఈ ఎనిమిదేళ్లలో దేశానికి దిక్సూచిలా తెలంగాణ మారిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గురువారం పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమైక్య పాలకులు తెలంగాణపై వివక్ష చూపారని, స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని సీఎం ఆరోపించారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ల నుంచే వివక్ష ప్రారంభమైందని, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోవాల్సి వచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు.
కేంద్రంతో నిత్యం పోరాటమే:
అప్పుడు కేంద్రం అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చిందని సీఎం వెల్లడించారు. ఆనాటి నుంచి నేటివరకూ మన రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తోందని కేసీఆర్ వివరించారు. ఐదేళ్లపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసిందని.. మన హైకోర్టు మనకు ఏర్పాటైన తర్వాత అవసరమైన సిబ్బందిని, నిధులను, భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి గాను ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారని సీఎం వెల్లడించారు.
నీతి అయోగ్ సిఫార్సులు బుట్టదాఖలు:
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సంబంధించి తెలంగాణకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం లెక్క చేయలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తానే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యమన్నారు. కరోనా క్లిష్ట పరిస్ధితుల్లోనూ కేంద్రం రాష్ట్రాలకు నయాపైసా అదనంగా ఇవ్వలేదని సీఎం ధ్వజమెత్తారు. పైగా న్యాయంగా రావాల్సిన నిధులపైనా కోత విధించిందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణకు ఏ ప్రోత్సాహం లేదు:
కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆ నాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిందని.. కానీ, ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రాత్సాహకాలు ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొందని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ, తెలంగాణకు కేంద్రం చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు ఏవీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేదన్నారు.
ఐటీఐఆర్‌తో తీరని అన్యాయం:
తెలంగాణలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అమలుచేసి ఉంటే ఐటీ రంగం మరింత అభివృద్ధి సాధించేదని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని స్పష్టంగా పేర్కొందని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ కేంద్రం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేయడాన్ని ఆయన ఖండించారు. ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థుల కష్టాలపైనా కేసీఆర్ స్పందించారు.
ఉక్రెయిన్ వైద్య విద్యార్ధుల ఖర్చు భరిస్తానని చెప్పా:
ఈ పిల్లలంతా మన దేశంలోనే వైద్యవిద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి తాను స్వయంగా లేఖ రాశానని సీఎం వెల్లడించారు. మన రాష్ట్ర విద్యార్థుల వైద్యవిద్యకు అయ్యే ఖర్చును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలియజేశానని... కానీ, కేంద్రం నుంచి స్పందన లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మిగిలిపోవడం విషాదమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలుకు కొర్రీలు:
తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని తనతో సహా ప్రజాప్రతినిధులందరం కలిసి ధర్నా చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. ధాన్యం సేకరణపై 24 గంటల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినా స్పందన లేదని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతులు భిక్షగాళ్లు కాదని.. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, రైతులతో పెట్టుకోవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కేంద్రంలో నిరంకుశత్వం:
కేంద్రం చేతులెత్తేయడంంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలుకు నడుం బిగించిందని సీఎం చెప్పారు. ధాన్యం దిగుబడి, కొనుగోళ్ళలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించిందని కేసీఆర్ తెలిపారు. ప్రపంచ దేశాలు అనేక సంఘర్షణలు, పోరాటాల పర్యవసానంగా రాచరిక, నియంతృత్వ దశలను అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయని కేసీఆర్ గుర్తుచేశారు. అత్యధిక దేశాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రక్రియను అవలంబిస్తూ పౌర సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయన్నారు. కానీ, మన దేశంలో అందుకు విరుద్ధంగా జరిగిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ ధ్యేయం .. బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు:
భారత రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను, స్వయంప్రతిపత్తిని కల్పించిందని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకూ కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాశాయని ఆయన ఫైరయ్యారు. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయని కేసీఆర్ ఆరోపించారు. సర్కారియా, పూంఛ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయని.. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ నివేదికలను బుట్ట దాఖలు చేశాయని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకున్నదని కేసీఆర్ ఆరోపించారు.
విద్వేష రాజకీయాల్లో దేశం చిక్కింది:
75 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఈ 8 ఏళ్లలో తెలంగాణ సాధించిందని సీఎం తెలిపారు. ఆర్ధిక వృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, విద్యుత్తు సరఫరా, తాగునీరు, సాగునీటి సదుపాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. దళిత బంధు కోసం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. దేశంలో మతపిచ్చి తప్పించి వేరే చర్చ లేదని... విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments