CM KCR:టీడీపీని ఎన్టీఆర్ అందుకే స్థాపించారు: సీఎం కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ పరిపాలన బాగలేకనే కదా ఎన్టీఆర్ టీడీపీని పెట్టారని.. బాగుంటే ఎందుకు పెడతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2లకే కిలో బియ్యం ఇచ్చాకే పేదల కడుపు నిండిందని కొనియాడారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు నష్టం చేసిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఉన్న తెలంగాణను బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారన్నారు. మళ్లీ మన తెలంగాణ సాధించడం కోసం 58 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగా ఇస్తామంటే 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిశామని.. ఇవ్వకపోయే సరికి ఉద్యమం తీవ్రతరం చేశామన్నారు. అనేక పోరాటాల తర్వాత సకలజనుల సమ్మె అంటూ ఉద్యమం చేస్తే గానీ తెలంగాణ కల సాకారం కాలేదని కేసీఆర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు ఆయన శుభవార్త చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ ఖర్చులను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్యాసింజర్ ఆటోలకు ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments