CM KCR:రేపు అధికారిక లాంఛనాలతో గద్ధర్ అంత్యక్రియలు.. కేసీఆర్ ఆదేశాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్ధర్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు గద్ధర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారిని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం గద్ధర్ పార్ధివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు గద్ధర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అభిమానులు భారీగా తరలిరావడంతో ఎల్బీ స్టేడియం కిటకిటలాడుతోంది. సోమవారం ఉదయం వరకు ఆయన భౌతికకాయాన్ని స్టేడియంలోనే వుంచనున్నారు.
మహాబోధి పాఠశాల ఆవరణలో గద్ధర్ అంత్యక్రియలు :
మధ్యాహ్నం గద్ధర్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. పేద విద్యార్ధుల కోసం ఆయన ఆల్వాల్‌లో నెలకొల్పిన మహాబోధి పాఠశాలలోనే గద్ధర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ విద్యాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశాన్ని అధికారులు పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నారు.
తన పాటతో సమాజాన్ని చైతన్య పరిచిన గద్ధర్ :
1949లో అప్పటి మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించిన గద్ధర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. నిజామాబాద్, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1975లో కెనరా బ్యాంక్‌లో ఓ చిన్న ఉద్యోగంలో చేరారు. గద్ధర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. కొన్నాళ్లు ఉద్యోగం చేసిన ఆయన అనంతరం కళారంగంలోకి ప్రవేశించారు. బుర్రకథ, పాటలు, ఆటలతో బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు. జన నాట్యమండలి ద్వారా తన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. కారంచేడులో దళితుల ఊచకోతపై పోరాడారు. పీపుల్స్‌వార్, సీపీఐ ఎంఎల్ వంటి మావోయిస్టు గ్రూపులతో కలిసి పనిచేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. అనంతర కాలంలో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com